ఖర్గ్ ద్వీపంపై US ప్లాన్?.. చమురు రవాణాకు భారీ ముప్పు
ప్రపంచ దేశాలను మరో చమురు సంక్షోభం వణికించేలా కనిపిస్తోంది. ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తుండటంతో, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
By: Madhu Reddy | 26 March 2026 12:01 PM ISTప్రపంచ దేశాలను మరో చమురు సంక్షోభం వణికించేలా కనిపిస్తోంది. ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తుండటంతో, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికి ప్రతిచర్యగా సరకు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఒకవేళ ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..
ఖర్గ్ ద్వీపం.. ఇరాన్ గుండెకాయ:
ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ద్వీపం ఒక ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచే అత్యధిక శాతం ముడి చమురు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ అడుగు వేస్తోంది. కానీ, ఇది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసే ప్రమాదకర పరిణామం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాబ్ ఎల్-మండేబ్‌పై ఇరాన్ హెచ్చరిక:
అమెరికా ఎత్తుగడలకు ప్రతిగా ఇరాన్ తన దగ్గర ఉన్న బలమైన అస్త్రాన్ని బయటకు తీసింది. యెమెన్ సమీపంలో ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. సముద్ర మార్గంలో సరకు రవాణాకు ఇది ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇక ఒకవేళ ఇరాన్ ఈ దారిని మూసివేస్తే, రవాణా నౌకలన్నీ ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ దూరం పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి.
హౌతీ మిలిటెంట్ల మద్దతు.. పెరుగుతున్న ఉద్రిక్తత:
ఈ గొడవలో ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ మిలిటెంట్ గ్రూప్ 'హౌతీ' రంగంలోకి దిగింది. అమెరికా చర్యలను తాము అడ్డుకుంటామని, ఇరాన్ నిర్ణయాలకు అండగా ఉంటామని హౌతీ గ్రూప్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులతో అలజడి సృష్టిస్తున్న హౌతీలు, ఇప్పుడు నేరుగా అమెరికా ప్లాన్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక చమురు రవాణా జరిగే ప్రధాన మార్గాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటే, దాని ప్రభావం భారత్ వంటి దేశాలపై చాలా తీవ్రంగా ఉంటుంది.
పెరగనున్న ఆర్థిక భారం:
ట్రంప్ చర్యలతో మొదలైన ఈ చమురు రాజకీయం ఎటు దారితీస్తుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది. చమురు సంక్షోభం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం. అగ్ర దేశాల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలు బలి కాకూడదని అందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చర్చల ద్వారా ఈ సమస్య సద్దుమణుగుతుందా లేక చమురు ధరలు మండిపోతాయా అనేది వేచి చూడాలి.
