Begin typing your search above and press return to search.

భయపడినంతా అయ్యింది... సొంత పౌరులపై ఇరాన్ ప్రతీకారం స్టార్ట్!

అవును... ఇజ్రాయెల్ తో జరిగిన భీకర యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించింది. ఇప్పుడు స్వదేశంలోని పౌరులపై చర్యలకు ఉపక్రమించింది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 7:00 AM IST
భయపడినంతా అయ్యింది... సొంత పౌరులపై ఇరాన్  ప్రతీకారం స్టార్ట్!
X

'యుద్ధం సృష్టించే విధ్వంసం, ఆంక్షలు, చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ ఇదంతా ప్రభుత్వ దురాశ వల్లే'.. 'తమకు యుద్ధం వద్దు, ఈ ఆంక్షలు వద్దు, ఈ కాల్పుల విరమణ కూడా వద్దు. తాము కోరుకునేదల్లా మేం ఎంతో ప్రేమించే ఈ దేశంలో మనశ్శాంతితో జీవించడమే'.. 'యుద్ధం కంటే తమను ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే.. గాయపడిన, అవమానపడిన ఇస్లామిక్ రిపబ్లిక్‌'!

'అమెరికాపై గెలవలేకపోయామనే ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఇప్పుడు ఇరాన్ ప్రజలపై చూపిస్తుంది'.. 'అరెస్టులు పెరుగుతాయి, ఉరిశిక్షలు, వేధింపులను రెట్టింపు చేస్తారు'.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ప్రజలు చేసిన వ్యాఖ్యలు ఇవి! 'యుద్ధం వల్ల ఏర్పడిన నష్టాన్ని ప్రజలే భరించాల్సి ఉంటుందీ అని ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వారు భయపడినంత పని అయ్యింది!

అవును... ఇజ్రాయెల్ తో జరిగిన భీకర యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించింది. ఇప్పుడు స్వదేశంలోని పౌరులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ముగ్గురు ఇరానియన్లను ఇప్పటికే ఉరి తీయగా.. తాజాగా 700 మందిని అరెస్ట్ చేసింది. దీంతో.. ఆ 700 మంది పరిస్థితి ఏమిటనేది ఆందోళనగా ఉందంటున్నారు. ఈ విషయాలను స్థానిక మీడియా వెళ్లడించింది.

ఈ సమయంలో.. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కోసం పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. ఈ విషయాన్ని ఆ దేశ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థ నివేదించింది. వీరు ముగ్గురూ మొసాద్‌ తో సంబంధాలు కలిగి ఉన్నందుకు.. పశ్చిమాసియా దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలను సులభతరం చేసినందుకు దోషులుగా తేలినట్లు తెలిపింది.

ఇదే సమయంలో... ఇజ్రాయెల్‌ తో సంబంధాల ఉన్నాయనే ఆరోపణలతో మరో 700 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర అనుబంధ నూర్‌ న్యూస్ నివేదించింది. దీంతో... ఈ రెండు విషయాలు ఇప్పుడు ఇరాన్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 12 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.