యుద్ధం ముగింపునకు ఇరాన్ ఏడు షరతులు.. అమెరికా అంగీకారం సందేహమే!
మధ్యప్రాచ్యంలో శాంతి చిగురిస్తుందని ఆశించిన ప్రతిసారీ కొత్త చిక్కుముడులు పడటం పరిపాటిగా మారింది.
By: A.N.Kumar | 25 March 2026 11:59 AM ISTమధ్యప్రాచ్యంలో శాంతి చిగురిస్తుందని ఆశించిన ప్రతిసారీ కొత్త చిక్కుముడులు పడటం పరిపాటిగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐదు రోజుల యుద్ధ విరామం ఒక చిన్న ఊరటనిస్తుందని భావించినా.. ఇరాన్ తాజాగా తెరపైకి తెచ్చిన 'ఏడు షరతులు' ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. యుద్ధం ముగియాలంటే తాము కోరినట్లుగా అంతర్జాతీయ సమీకరణాలు మారాలని ఇరాన్ భీష్మించుకు కూర్చోవడం.. అగ్రరాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసే వ్యూహంగా కనిపిస్తోంది.
ఆ ఏడు కీలక షరతులు ఇవే..
ఇరాన్ ముందు ఉంచిన డిమాండ్లు అమెరికాకు మింగుడుపడని విధంగా ఉన్నాయి.
1. సైనిక స్థావరాల తరలింపు: గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేసి, బలగాలను వెనక్కి తీసుకోవాలి.
2. దాడి చేయబోమని హామీ: భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై ఎలాంటి సైనిక చర్యలు చేపట్టబోమని అమెరికా లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.
3. ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత: ఇజ్రాయెల్–హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలను తక్షణమే నిలిపివేసేలా అమెరికా ఒత్తిడి చేయాలి.
4. ఆంక్షల ఎత్తివేత: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అన్ని రకాల అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను తొలగించాలి.
5. యుద్ధ పరిహారం: యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టానికి భారీ పరిహారం చెల్లించాలి.
6.క్షిపణి కార్యక్రమం: ఇరాన్ స్వదేశీ క్షిపణి , రక్షణ కార్యక్రమాలపై ఎటువంటి పరిమితులు ఉండకూడదు.
7. హార్మూజ్ జలసంధిపై పట్టు: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఫీజులు వసూలు చేసే హక్కు ఇరాన్‌కు ఉండాలి.
వ్యూహాత్మక ఒత్తిడి.. షరతులా? లొంగుబాటు పత్రాలా?
ఇరాన్ ప్రతిపాదించిన డిమాండ్లు కేవలం శాంతి ఒప్పందానికి సంబంధించినవి మాత్రమే కావు. అవి ఆ ప్రాంతంలో అమెరికా ఉనికిని నామరూపాలు లేకుండా చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా తొలగించాలన్న డిమాండ్.. వాషింగ్టన్ ఏమాత్రం అంగీకరించలేని అంశం. బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్ వంటి వ్యూహాత్మక కేంద్రాలను వదులుకోవడం అంటే.. పశ్చిమాసియాలో తన పట్టును పూర్తిగా కోల్పోవడమే.
మరోవైపు ఇజ్రాయెల్–హిజ్బుల్లా ఘర్షణలపై నియంత్రణ కోరడం ద్వారా ఇరాన్ తన ప్రాక్సీ బలగాలకు రక్షణ కవచం నిర్మించుకోవాలని చూస్తోంది. తన క్షిపణి కార్యక్రమంపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని కోరడం ద్వారా భవిష్యత్తులో మరింత బలమైన సైనిక శక్తిగా ఎదగాలన్నది టెహ్రాన్ ప్రణాళికగా స్పష్టమవుతోంది.
ఆర్థిక అస్త్రం.. హార్మూజ్ జలసంధి ముప్పు
ఇరాన్ పెట్టిన షరతుల్లో అత్యంత ప్రమాదకరమైనది హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఫీజులు వసూలు చేసే హక్కు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 30 శాతం వాటా ఉన్న ఈ మార్గాన్ని నియంత్రించడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవడమే. ఇది కేవలం అమెరికాపైనే కాకుండా భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల ఇంధన భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రాంతీయ దేశాల భయం
సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించడం ఆ ప్రాంతంలో సరికొత్త దౌత్య సంక్షోభానికి దారితీసింది. అమెరికాకు సహకరిస్తే తమపై దాడులు తప్పవన్న హెచ్చరికలు.. ఆయా దేశాలను ఇరకాటంలో పడేశాయి. ఒకవైపు అమెరికా రక్షణ కవచం, మరోవైపు ఇరాన్ భౌగోళిక సామీప్యత మధ్య ఈ దేశాలు నలిగిపోతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ల కఠిన వైఖరి చూస్తుంటే వారు చర్చల కంటే 'వ్యూహాత్మక పైచేయి' సాధించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అమెరికా ఈ షరతులకు తలొగ్గే అవకాశం ఎంతమాత్రం లేదు. అగ్రరాజ్యం తన గౌరవాన్ని, మిత్రదేశాల భద్రతను పణంగా పెట్టి ఈ ఒప్పందానికి ఒప్పుకోదు.
ఫలితంగా ఈ ప్రతిపాదనలు శాంతికి మార్గం వేయడం కంటే, యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. అగ్రరాజ్యాల పంతాల మధ్య మధ్యప్రాచ్యం మరెంత కాలం రావణకాష్టంగా మారుతుందో వేచి చూడాలి. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని, ఇరు పక్షాలను చర్చల మేజా వద్దకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
