Begin typing your search above and press return to search.

ధర్మశాలలో మ్యాచ్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.. భయంతో వణికిపోయిన ఆటగాళ్లు!

భారత్, పాకిస్థాన్ మధ్య కొద్ది రోజుల కిందట యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 May 2025 1:00 AM IST
ధర్మశాలలో మ్యాచ్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.. భయంతో వణికిపోయిన ఆటగాళ్లు!
X

భారత్, పాకిస్థాన్ మధ్య కొద్ది రోజుల కిందట యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ సడన్‌గా ఆగిపోవడం పెద్ద సంచలనమే సృష్టించింది. మొదట్లో ఫ్లడ్‌లైట్లు పాడైపోవడం వల్లే మ్యాచ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ అసలు విషయం వేరే ఉంది! సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేయడంతోనే మ్యాచ్ ఆపేసి, స్టేడియాన్ని వెంటనే ఖాళీ చేయాల్సి వచ్చిందట. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధర్మశాల స్టేడియంలోనే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలీసా హీలీ కూడా ఉంది. ఆమె ఢిల్లీ జట్టు ప్లేయర్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ భార్య కావడం విశేషం. మ్యాచ్ ఆగిపోయిన తర్వాత స్టేడియంలో ఏం జరిగిందో ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో స్వయంగా చెప్పుకొచ్చింది.

అలీసా హీలీ మాట్లాడుతూ.. "మేము ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ల ఫ్యామిలీస్‌తో కలిసి ఒక పెద్ద గ్రూప్‌లా ఉన్నాం. మొదట రెండు ఫ్లడ్‌లైట్లు ఆగిపోయాయి. మ్యాచ్ మళ్లీ స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. ఇంతలో మా దగ్గరలో కూర్చున్న వాళ్లు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నారని మాట్లాడుకోవడం విన్నాం. కొద్దిసేపటికి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. కానీ మేం 'ఏం పర్లేదు' అని అక్కడే ఉండిపోయాం. అందరూ వెళ్లాక నెమ్మదిగా వెళ్దామని అనుకున్నాం.

అప్పటికి మాకు అంతా నార్మల్‌గానే అనిపించింది. కానీ జనాలు మాత్రం హడావిడిగా పైకి కిందకి తిరుగుతున్నారు. ఇంకో వ్యక్తి వచ్చి మా గ్రూప్‌లో ఉన్న ఒక చిన్న పిల్లాడిని తీసుకుని 'మనం వెంటనే బయలుదేరాలి' అని తొందర పెట్టాడు. అంతలోనే ప్లేయర్స్ కూడా అక్కడికి వచ్చేశారు. వాళ్ల మొహాల్లో టెన్షన్ క్లియర్‌గా కనిపిస్తోంది. డుప్లెసిస్ అయితే బూట్లు కూడా వేసుకోకుండానే అక్కడి నుంచి కదిలాడు. స్టార్క్‌ను ఏమైందని అడిగితే.. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని, దానివల్ల ఈ ఏరియాలో మొత్తం కరెంట్ తీసేశారని, అందుకే స్టేడియంలో లైట్లు ఆగిపోయాయని చెప్పాడు. దాంతో మేం వెంటనే వ్యాన్‌లలో ఎక్కి హోటల్‌కు వెళ్లిపోయాం. ఆ టైమ్‌లో నిజంగా భయమేసింది" అని చెప్పుకొచ్చింది అలీసా. అంటే, ఫ్లడ్‌లైట్ల సమస్య కాదు, పాకిస్థాన్ డ్రోన్ దాడుల భయంతోనే అంత హడావుడిగా మ్యాచ్ ఆపేశారన్నమాట. ఆటగాళ్లలోనూ ఆందోళన కనిపించడం ఆ పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తోంది.