Begin typing your search above and press return to search.

షాకింగ్.. యూపీఐ వ్యవస్థ అప్పుడు డౌన్ అవ్వడానికి ఒక కారణం ఐపీఎల్ బెట్టింగ్ ?

ఈ బెట్టింగ్ భూతం దేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను ఎలా అతలాకుతలం చేస్తోందో, దీనికి యూపీఐ వ్యవస్థ కూడా ఎలా బలవుతోందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:39 AM IST
షాకింగ్.. యూపీఐ వ్యవస్థ అప్పుడు డౌన్ అవ్వడానికి ఒక కారణం ఐపీఎల్ బెట్టింగ్ ?
X

కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే కేవలం ఆట కాదు, ఒక పండగ. రెండున్నర నెలల పాటు టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ టోర్నమెంట్, ఎంతో ఉత్సాహాన్ని, వినోదాన్ని అందిస్తుంది. అయితే, ఈ మెరుపుల వెనుక ఒక అత్యంత ప్రమాదకరమైన చీకటి ప్రపంచం దాగి ఉంది. అదే ఐపీఎల్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ భూతం దేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను ఎలా అతలాకుతలం చేస్తోందో, దీనికి యూపీఐ వ్యవస్థ కూడా ఎలా బలవుతోందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో యూపీఐ వ్యవస్థ చాలా సార్లు క్రాష్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోట్లాది మంది ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం యూపీఐపై ఆధారపడి ఉన్నందున, ఈ అంతరాయం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. అయితే, ఈ యూపీఐ క్రాష్‌లకు ప్రధాన కారణం ఐపీఎల్ బెట్టింగ్ లావాదేవీల నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడే అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఆన్‌లైన్ జూదం, ఒక చిన్నపాటి సరదాగా మొదలై, క్రమంగా లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌తో దేశ బ్యాంకింగ్ రంగం సామర్థ్యాన్ని పరీక్షించే స్థాయికి చేరింది. బెట్టింగ్ మాఫియా తమ అక్రమ లావాదేవీలను వేగంగా నిర్వహించడానికి యూపీఐని విస్తృతంగా వాడుకోవడంతో, సిస్టమ్‌పై ఊహించని భారం పడి, అది అస్తవ్యస్తంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, అక్రమ జూదం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న పెను ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది.

ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ అనుకునే స్థాయికి చేరింది పరిస్థితి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజేతగా నిలిచినా , దాని వెనుక జరిగిన బెట్టింగ్ వ్యవహారం చాలా మందిని కోలుకోలేని దెబ్బ తీసింది. బెట్టింగులో డబ్బులు గెలిచిన వారి ఒకటి రెండు అరుదైన విజయగాథలను చూసి, చాలామంది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బెట్టింగ్‌ను ప్రారంభిస్తున్నారు. త్వరగా డబ్బులు వస్తాయని ఆశించి దిగినవారు క్రమంగా ఈ వ్యసనంలో కూరుకుపోతున్నారు.

వ్యసనపరులుగా మారిన వారు, అప్పులు తీర్చడానికి క్రెడిట్ కార్డులు, లోన్ యాప్‌లను ఆశ్రయిస్తూ మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఈ సమస్యను తల్లిదండ్రులకు చెప్పలేక, ఎలా బయటపడాలో తెలియక వారు తీవ్ర మానసిక సంఘర్షణతో నరకం అనుభవిస్తున్నారు. ఈ బెట్టింగ్ భూతం అనేక మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తోంది.

ఆధునిక జూదం, సాంకేతికత సహాయంతో విపరీతంగా పెరిగిపోతోంది. ప్లేస్టోర్‌లలో అనేక యాప్‌లు అందుబాటులో ఉండటమే కాకుండా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అనేక అక్రమ వెబ్‌సైట్‌లు మధ్యతరగతి వారికి వల విసురుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఏటా రూ.8.50 లక్షల కోట్లకు పైగా జూదం ద్వారా చేతులు మారుతున్నట్లు అంచనా.

ఈ అక్రమ వ్యాపారాన్ని కొందరు భారతీయ చట్టాలకు చిక్కకుండా విదేశాల నుండి నడుపుతున్నారు. క్రిప్టోకరెన్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించి, అనామకుల పేరు మీద బ్యాంకులలో 'మ్యూల్ అకౌంట్స్' తెరిచి, వాటి ద్వారా భారీగా బెట్టింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవస్థలోని లోపాలు, నిబంధనలపై పాలకుల నిర్లక్ష్యం ఆన్‌లైన్ జూదం వృద్ధికి కారణమవుతున్నాయి.

స్కిల్ ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్ భారతదేశంలో చట్టబద్ధమైనది, అది ప్రభుత్వానికి గణనీయమైన పన్ను ఆదాయాన్ని, ఉపాధిని (లక్షన్నర మందికి) అందిస్తోంది. అయితే, ఈ చట్టబద్ధమైన వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న చీకటి బెట్టింగ్ ప్రపంచం ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రూ.6,000 కోట్ల మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో విచారణకు గురికావడం, పాలకుల చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

బెట్టింగ్ కంపెనీలు సామాన్య ప్రజలతో ఒక మెంటల్ గేమ్ ఆడుతాయి. ప్రారంభంలో చిన్న చిన్న గెలుపులు వచ్చేలా చేసి, వారి మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తాయి. ఈ 'అదృష్టం' అనే భావన వారిని మరింతగా బెట్టింగ్‌ వైపు నెట్టివేస్తుంది. ఇది వ్యాయామం, సంగీతం, లేదా ప్రియమైన వారితో గడిపే సమయం నుండి వచ్చే డోపమైన్ లాంటిదే, కానీ దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బెట్టింగ్‌లో గెలవాలనే ఆశతో సర్వస్వం పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయి, నరకం చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు.