Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫైనల్లో 'సిందూర్ హీరోలు'.. సైన్యాధికారులకు బీసీసీఐ ఆహ్వానం!

ప్రపంచంలోనే పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ కు ప్రముఖ గాయకులతో షో ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   27 May 2025 9:15 PM IST
ఐపీఎల్ ఫైనల్లో సిందూర్ హీరోలు.. సైన్యాధికారులకు బీసీసీఐ ఆహ్వానం!
X

17 ఏళ్ల చరిత్రలో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాయిదా పడింది ఈ సీజన్ లోనే. దీనికి కారణం కపట పాకిస్థాన్ రాజేసిన ఉగ్రవాద నిప్పే. పెహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశమంతా ఒక్కటైంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ తర్వాత తన పరాక్రమం ఏమిటో చూపించింది. అదే సమయంలో ఐపీఎల్ 8 రోజుల పాటు వాయిదా పడింది. తిరిగి ఈ నెల 17 నుంచి మొదలైంది. ఇప్పుడు లీగ్ దశ చివరి మ్యాచ్ జరగనుంది. ఇక ప్లేఆఫ్స్ సమరం గురువారం నుంచి మొదలుకానుంది.

వాస్తవానికి ఈ నెల 25తోనే ఐపీఎల్ 18వ సీజన్ ముగియాల్సి ఉంది. పాకిస్థాన్ తో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా వాయిదా తప్పలేదు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న సైన్యాధికారులను ఆహ్వానిస్తుండడం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మేరకు సైన్యాధికారులను ఫైనల్ సందర్భంగా సన్మానించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.

ఫైనల్ కు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ లతో పాటు ఐపీఎల్ ఫైనల్ కు సైన్యంలోని ఉన్నతాధికారులు, జవాన్లను కూడా ఆహ్వానించింది బీసీసీఐ.

ప్రపంచంలోనే పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ కు ప్రముఖ గాయకులతో షో ఏర్పాటు చేశారు. దీనికితోడు మిలటరీ బ్యాండ్ పరేడ్ కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ గుడ్ స్టెప్.. పాక్ కు స్ట్రాంగ్ కౌంటర్..

ఈ నెల 8న ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోయే సమయానికి 57 మ్యాచ్ లు జరిగాయి. మిగిలిన 17 మ్యాచ్ లను ఈ నెల 17 నుంచి నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఫైనల్ కు ఎన్నడూ లేనివిధంగా సైన్యాధికారులను ఆహ్వానించి బీసీసీఐ గుడ్ స్టెప్ వేసిందనే చెప్పాలి. ఎలాంటి ఉగ్ర చర్యలు భారత దేశాన్ని ఏమీ చేయలేవని.. మన సైన్యం ముందు శత్రువు నిలవలేడనే సందేశం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కొసమెరుపు: భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడింది. ఉద్రిక్తతలు చల్లారక మళ్లీ ప్రారంభమైంది. అయితే, ఆ లీగ్ ముగింపు అత్యంత పేలవంగా సాగింది. ఐపీఎల్ ఫైనల్ మాత్రం అట్టహాసంగా సైన్యాధికారుల సమక్షంలో జరగనుంది.