Begin typing your search above and press return to search.

రంగంలోకి ఐప్యాక్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేస్తున్నారా.. ?

2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వైసిపి తరఫున పనిచేసిన ఐ ప్యాక్ టీం ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పనిచేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   15 April 2026 8:30 AM IST
రంగంలోకి ఐప్యాక్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేస్తున్నారా.. ?
X

2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వైసిపి తరఫున పనిచేసిన ఐ ప్యాక్ టీం ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పనిచేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం తప్పేమీ కాదు. గతంలో అన్ని పార్టీలు వ్యూహ కర్తల కనుసన్నల్లో ముందుకు సాగాయి. టిడిపి కూడా వ్యూహకర్తను నియమించుకుని గత ఎన్నికల సమయంలో యువ గళం వంటి పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపించింది.

ఇక వైసిపి అయితే పూర్తిస్థాయిలో వ్యూహకర్తలపైనే ఆధారపడి గత ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు జనసేన తరఫున కూడా ఐపాక్ సిబ్బంది రంగంలోకి దిగారని తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా క్షేత్రస్థాయిలో ఏ విధమైన వ్యూహాలను అనుసరించాలి, కేడర్‌ను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై వ్యూహకర్తల నుంచి సమాచారం సేకరించే దిశగా జనసేన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాఖపట్నం అదేవిధంగా అరకు, పాడేరు వంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సర్వే బృందం పెద్ద ఎత్తున పర్యటిస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి ఉన్న బలం ఏమిటి? ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అనే అంశాలపై చర్చిస్తోంది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐప్యాక్ టీం సభ్యులు రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే ఈ బృందంలో గతంలో వైసీపీలో పని చేసిన వారిని కాకుండా తమిళనాడు అదేవిధంగా బీహార్ లో పనిచేసిన బృందాన్ని నియమించుకున్నట్టు సమాచారం.

తద్వారా ప్రజల నుంచి అదే విధంగా కేడర్ నుంచి జనసేన పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. సుమారు 30 మందితో కూడిన ఈ బృందం విశాఖపట్నంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు గిరిజన మన్యం ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టింది. జనసేన ఇటీవల కాలంలో మన్యం ప్రాంతాలకు ముఖ్యంగా గిరిజనులకు చేరువ అవుతున్న విషయం తెలిసిందే. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఆయా గిరిజన నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అన్నది జనసేన అంచనా వేసుకునే ప్రయత్నంలో ఉంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో పోలవరంలో జనసేన విజయం సాధించింది ఇది కూడా గిరిజన నియోజకవర్గం. కానీ వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా జనసేన విజయం దక్కించుకునే దిశగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.ఈ క్ర‌మంలో ఏ విధమైన అంశాలను పరిగణాలలోకి తీసుకోవాలి అనే దిశగా ఈ సర్వే సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది? క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే అంశాలను ఈ బృందం తెలుసుకుంటున్నాయి. అనంతరం ఈ బృందం సూచనల మేరకు పార్టీ తరఫున కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.