Begin typing your search above and press return to search.

"నా మరణ దినోత్సవ వేడుక ఆహ్వానం"... రొటీన్ కి భిన్నంగా మాజీ మంత్రి!

అవును... నమ్మడానికి కాస్త అటు ఇటుగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం! తనకు తన మరణదినం ఎప్పుడో తెలియదు గనుక బతికుండగానే ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుని అందరికి షాకిచ్చారు ఒక మాజీ మంత్రి.

By:  Tupaki Desk   |   14 Oct 2023 6:29 AM GMT
నా మరణ దినోత్సవ వేడుక ఆహ్వానం... రొటీన్  కి భిన్నంగా మాజీ మంత్రి!
X

చనిపోయిన తర్వాత ఏమవుతుంది.. అంతా తన గురించి ఏమనుకుంటారు.. అసలు పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు.. తనను ఏ విధంగా పొగుడుతారు, ఎంత మంది తిట్టుకుంటారు.. వంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటుందని అంటుంటారు. అయితే ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి ఉన్నట్లుగా ఆ అవకాశం ఉండదు! దీంతో... తన మరణ దినోత్సవాన్ని ఒక వేడుకకు జరుపుకుంటూ, దానికి ఆహ్వాన పత్రికలు ప్రింట్ వేయించి, అయినవారందరికీ పంచుతున్నారు మాజీ మంత్రి!

అవును... నమ్మడానికి కాస్త అటు ఇటుగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం! తనకు తన మరణదినం ఎప్పుడో తెలియదు గనుక బతికుండగానే ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుని అందరికి షాకిచ్చారు ఒక మాజీ మంత్రి. దీంతో ఈ రోజు ఆ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలా అని ఇదే ఫస్ట్ అనుకుంటే పొరపాటే... గతేడాది కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి ఘనంగా నిర్వహించారు.

వివరాళ్లోకి వెళ్తే... బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు ఒక వింత కార్యక్రమానికి తెరలేపారు. 1959లో జనించినట్లు చెబుతున్న ఆయన.. 75 సంవత్సరాలు జీవించగలనని చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే... 2034వ సంవత్సరం వరకూ జీవిస్తారంట. దీంతో చనిపోయే సంవత్సరానికి 12ఏళ్లకు ముందు నుంచీ మరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట.

ఇందులో భాగంగా.. ఇంకా 12 ఏళ్లు ఉందని లెక్కించి గతేడాది మరణ దిన వేడుకలు జరుపుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ ఈ ఏడాది ఇంక 11వ మరణ దిన వేడుకలకు ఆహ్వానం అందించారు. ఇందులో భాగంగా.. ఈనెల 14న (నేడు - శనివారం) టీటీడీ కళ్యాణ మండపంలో వేడుకలు జరుగనున్నట్లు ప్రకటించారు! ఇదే సమయంలో వచ్చే ఏడాది 10వ మరణ దిన వేడుకలకు ఆహ్వానిస్తానని కూడా ఆహ్వాన పత్రికలో ప్రస్తావించడం గమనార్హం.

ఈ విషయాలపై స్పందించిన ఆయన... ఎవరైనా తాను ఎంత కాలం జీవించగలను అనే విషయాలను అంచనా వేసుకోగలిగే... ఉన్నంత కాలంలో నలుగురికీ ఉపయోగపడే పనులు ఏమి చేయవచ్చో ఆలోచిస్తారని అంటున్నారు. ఇదే సమయంలో... బ్రతికి ఉన్నంతకాలమే ఈ బంధాలు, బందుత్వాలు, బాధ్యతలు ఉంటాయనే విషయం అంతా గుర్తుంచుకునే విధంగా ఆచరణలో చేసి చూపాలనే ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉంటుందని, ఆయన ఇప్పటికే ఇది ఒకసారి జరిపారని తెలుసుకున్నవారు కొంతమంది షాకవుతుంటే... ఉద్దేశ్యంలో నిగూఢార్ధాన్ని అర్ధంచేసుకునే పనిలో మరికొందరు ఉన్నారు.

కాగా... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా పేరున్న పాలేటి రామారావు.. 1994, 1999లో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో 2004లో కొణిజేటి రోశయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మరోసారి ఓటమి చెందిన ఆయన 2019 ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు.