ప్రతీ ఇంటి తలుపు తట్టనున్న టీడీపీ
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం పనితీరు గురించి వారిని వివరిస్తారు.
By: Tupaki Desk | 14 Jun 2025 2:00 AM ISTతెలుగుదేశం పార్టీ ఇక ప్రతీ ఇంటి తలుపూ తట్టబోతోంది. ప్రతీ కుటుంబీకులను పలకరించబోతోంది. దానికి సందర్భం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అలాగే సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టామని టీడీపీ ప్రతి ఇంటికీ తిరిగి చెప్పబోతోంది. కార్యకర్తలు నాయకులు అంతా కలసి ప్రతీ ఇంటినీ సందర్శించి ప్రభుత్వ పాలన గురించి వివరిస్తారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ నాయకులు వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం పనితీరు గురించి వారిని వివరిస్తారు. వారు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో వాకబు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇక దీనిని విజయ యాత్రగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విజయయాత్రలో పార్టీ నాయకులు అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చంద్రబాబు కోరారు. ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అనేక విషయాలు పంచుకున్నారు. కార్యకర్తలు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వం ఏడాది కాలంలో సుపరిపాలన అందించింది అని దానిని ప్రజల ముందు పెట్టాలని బాబు కోరారు. అంతే కాదు, పార్టీని మరింత పటిష్టంగా ఎక్కడికక్కడ చేయాలని కోరారు. నాయకులు ప్రజా ప్రతినిధులు పార్టీ అంతా తీరిక చేసుకుని ప్రతీ సందర్భంలో కార్యకర్తలను కలవాలని వారి మంచి చెడులు చూడాలని కోరారు.
అదే విధంగా జూలై నెలలో పార్టీ క్యాడర్ కి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ శిక్షణా తరగతులలో చురుకైన వారిని ఎంపిక చేసి వారి నుంచి మంచి నాయకులను తయారు చేస్తామని బాబు చెప్పారు. పార్టీ అధికారంలో లేనపుడు పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అని వారిని ఎట్టి పరిస్థితులో విస్మరించేది లేదని బాబు హామీ ఇచ్చారు.
అదే సమయంలో పార్టీ ప్రభుత్వం రెండూ కో ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలని బాబు కోరారు. అందరికీ తగిన సమయంలో అవకాశాలు వస్తాయని అన్నారు. అలాగే పార్టీ పదవులు కూడా పనిచేసేవారికే ఇస్తామని బాబు చెప్పారు. మొత్తానికి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టబోతోంది అన్న మాట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టింది. అయితే అందులో క్యాడర్ లీడర్ పెద్దగా భాగస్వామ్యం కాలేదని చెబుతారు. అందుకే ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దాంతో టీడీపీ ఇపుడు క్యాడర్ ని లీడర్ ని ముందు పెట్టి ఇంటింటికి కార్యక్రమం సూపర్ సక్సెస్ చేయాలని చూస్తోంది అని అంటున్నారు.
