యుద్ధంలో ఇంటర్నెట్ ఎందుకు ఆపుతారు.. దీనికి కారణం ఏంటి ?
ఇంటర్నెట్ ద్వారా కూడా శత్రువు చొరబాటును నియంత్రించాలి. ఇది ఆధునిక యుద్ధ రీతి. అందుకే యుద్ధ సమయంలో ఇంటర్నెట్ ఆగిపోతుంది.
By: A.N.Kumar | 6 March 2026 3:48 PM ISTయుద్ధం జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి ఇంటర్నెట్ సేవలు బంద్ అవుతాయి. దీనికి కారణం టెక్నికల్ సమస్యలని చాలా మంది భావిస్తారు. కానీ కాదు. ఇంటర్నెట్ ఆపడం సైనిక వ్యూహం. ప్రమాద తీవ్రతను తగ్గించడం. శత్రువు అవకాశాలను దెబ్బతీయడం. కాలం మారే కొద్దీ.. యుద్ధ రీతులు మారుతున్నాయి. టెక్ యుగంలో ఇంటర్నెట్ కూడా ఒక యుద్ధరీతే. ఆకాశం, భూమి, నీరు ఇలా మూడు మార్గాల్లో శత్రువు చొరబాటును నియంత్రించడమే కాదు. ఇంటర్నెట్ ద్వారా కూడా శత్రువు చొరబాటును నియంత్రించాలి. ఇది ఆధునిక యుద్ధ రీతి. అందుకే యుద్ధ సమయంలో ఇంటర్నెట్ ఆగిపోతుంది.
సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం :
యుద్ధ సమయంలో ఒకరి కదలికలను మరొకరు గమనిస్తుంటారు. సైనిక దళాల కదలికలు, ఆయుధాల నిల్వలు, సైనిక స్థావరాల సమాచారం ప్రత్యర్థికి చాలా ముఖ్యం. ఈ కీలక సమాచారంతో యుద్ధ వ్యూహం మారుతుంది. మరింత ఖచ్చితత్వం వస్తుంది. తద్వారా గురిపెట్టిన లక్ష్యం నెరవేరుతుంది. ఈ సమాచార సేకరణ ఇంటర్నెట్ తో సులువు. ముఖ్యంగా హ్యాకింగ్ తో సాధ్యం. శత్రుదేశాలకు ఇలాంటి సమాచారం వెళ్తే అది చాలా ప్రమాదం. అందుకే ప్రభుత్వాలు ఇంటర్నెట్ ఆపేస్తాయి.
స్పై నెట్ వర్క్ :
యుద్ధంలో స్పై నెట్ వర్క్ చాలా కీలకం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య వెనుక ఖచ్చిత సమాచారం ఉంది. ఇది ఇచ్చిన మెస్సాద్, సీఐఏ పాత్ర మరువలేనిది. వాస్తవంగా తమ దేశానికి ముప్పు రాకుండా ముందస్తుగా శత్రువు ఎత్తుగడులను చిత్తుచేయడానికి స్పై నెట్ వర్క్ వాడుతారు. యుద్ధ సమయంలో వీరు మరింత కీలకం. శత్రువు కీలక డేటాను వీరు తస్కరిస్తారు. ఫలితంగా యుద్ధంలో పైచేయి సాధిస్తారు. ఇలాంటి ప్రమాద నివారణకు ఇంటర్నెట్ ఆపుతారు.
సైబర్ దాడుల కట్టడికి :
యుద్ధ బాంబులతో, మిసైళ్లతో మాత్రమే జరగదు. కంప్యూటర్లతో కూడా జరుగుతుంది. అదే సైబర్ దాడి. పవర్ గ్రిడ్ హ్యాక్ చేయడం, బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాక్ చేయడం, రాడార్ సిస్టమ్స్ పై దాడులు చేయడం వంటి పరిణామాలు ఉంటాయి. వీటిని నివారించడానికి ఇంటర్నెట్ ఆపుతారు.
పుకార్ల కు చెక్ :
యుద్ధ సమయంలో పుకార్లు షికారు చేస్తాయి. ఫలితంగా అనవసర ఆందోళనలు వ్యాప్తి జరుగుతాయి. దీనికి చెక్ పెట్టడానికి కూడా ఇంటర్నెట్ ఆపుతారు. లేదంటే యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల నిరసనలు వెలుగచూడకుండా ఉండటానికి కూడా ఇంటర్నెట్ ఆపుతారు. కొన్నిసార్లు శత్రువు నుంచి బయటపడ్డానికి.. ఇంకొన్నిసార్లు అంతర్గత సమస్యలు వెలుగు చూడకుండా ఉండటానికి ఇంటర్నెట్ ఆపుతారు. కానీ ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పవు.
మరి సైనికులకు ఎలా ?
ఇంటర్నెట్ ఆపితే సైనికులకు సంబంధించిన వ్యవస్థలు ఆగిపోవా అన్న ప్రశ్న రావొచ్చు. ఇంటర్నెట్ ఆపినా పనిచేయడానికి సైన్యం వద్ద ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా జరగాల్సిన పనులు జరుగుతాయి. మిలిటరీ రేడియో కమ్యూనికేషన్, సాటిలైట్ కమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్ మిలటరీ నెట్ వర్క్, డ్రోన్ల ద్వారా సమాచార సేకరణ, సమాచార వ్యాప్తి జరుగుతుంది.
