Begin typing your search above and press return to search.

యోగా మొదలయ్యి 5,000 ఏళ్లయింది.. ఇదే సాక్ష్యం!

అవును... నేడు ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2025 2:03 PM IST
యోగా మొదలయ్యి 5,000 ఏళ్లయింది.. ఇదే సాక్ష్యం!
X

యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ఒక పురాతన అభ్యాసం. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. నేడు 11వ అంతర్జాతీయ దినోత్సవం కాగా.. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా సుమారు 136 దేశాల్లో పాటిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తం అయిన యోగాకు సుమారు 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండొచ్చని అంటున్నారు.

అవును... నేడు ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. నేడు విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సమయంలో యోగా చరిత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి యోగా మూలాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయని అంటారు. కొన్ని సిద్ధాంతాలు సింధు - సరస్వతి నాగరికత సమయంలో క్రీ.పూ.2,700 ప్రాంతంలో దీని అభివృద్ధిని సూచిస్తున్నాయి. అయితే... కొంతమంది మాత్రం దీని మూలాలు సుమారు 10,000 సంవత్సరాల నాటివని నమ్ముతారు.

'యోగా' అనే పదం ముందుగా సంస్కృతంలోని పురాతన పవిత్ర గ్రంథమైన ఋగ్వేదంలో నమోదు చేయబడింది. ఋగ్వేదం క్రీ.పూ. 1500 - 1200 మధ్య వ్రాయబడిందని నిర్ధారించబడింది. ఈ కాలంలో.. యోగా అనేది బ్రాహ్మణ పూజారులు ఆచరించే శారీరక ప్రార్థన, మానసిక ధ్యానంతో కూడిన జీవనశైలిగా మారింది.

ఇక.. క్రీస్తు పూర్వం 5, 6వ శతాబ్దాలలో జైనమతం, బౌద్ధమతంతో సహా ప్రాచీన భారతదేశంలోని సన్యాసి, శ్రమ ఉద్యమాలలో క్రమబద్ధమైన యోగా భావనలు ఉద్భవించడం ప్రారంభించాయి. భౌతిక అభ్యాసాలను సూచించే హఠ యోగాపై దృష్టి సారించే గ్రంథాలు తంత్రంలో ఉద్భవించి 9, 11వ శతాబ్దాల మధ్య కనిపించడం ప్రారంభించాయి.

ఈ క్రమంలో... 1800ల చివరలో స్వామి వివేకానంద వంటి వ్యక్తుల ద్వారా యోగా పశ్చిమ దేశాలకు పరిచయం చేయబడింది. ఆయన యోగ గ్రంథాలను అనువదించారు. యోగాను ' సైన్స్ ఆఫ్ మైండ్’ (మనసుకు సంబంధించిన శాస్త్రం)గా అభివర్ణించారు.