ఆ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. విషనాగుల కంటే డేంజర్!
సుదీర్ఘ కాలంగా మీడియా రంగంలో ఉన్న ద టైమ్స్ ఆఫ్ ఇండియా.. సీఎన్ఎన్.. బీబీసీ.. న్యూయార్క్ టైమ్స్ లాంటి దిగ్గజ మీడియా సంస్థలు ప్రదర్శిస్తున్న పైత్యం..
By: Tupaki Desk | 27 April 2025 4:24 AMఎక్స్ ట్రా రాయాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే నిజం చెబితే చాలు. కానీ.. ఘనత వహించిన కొన్ని ప్రాశ్చాత్య మీడియా సంస్థలు ప్రదర్శిస్తున్న పైత్యం చూసినప్పుడు.. మీడియా ప్రమాణాలు ఇంత అధ:పాతాళానికి పడిపోవటమా?అన్న ఆశ్చర్యానికి గురయ్యేలా చేయటం ఖాయం. జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి సంబంధించి యావత్ ప్రపంచ ఒకలా స్పందిస్తుంటే.. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
యాత్రికులైన 26 మందిని మతం గురించి ప్రశ్నించి..కొందరు ప్యాంట్లు విప్పించి.. తనిఖీ చేసి మరీ చంపేసిన దారుణం యావత్ భారత్ ను కదిలించి వేస్తోంది. ఈ దుర్మార్గ దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఉగ్రదాడిని తప్పు పడుతూ.. భారత్ కు తమ సంఘీభావాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్కు ఉన్న కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు.. పహల్గాం ఉగ్రదాడిని అలా కాకుండా.. దాన్నో సాయుధుల దాడిగానూ.. మిలిటెంట్ల దాడిగా పేర్కొంటూ వార్తలు వండేస్తున్న వైనం చూస్తే.. వీళ్లకేం పోయే కాలం అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.
సుదీర్ఘ కాలంగా మీడియా రంగంలో ఉన్న న్యూయార్క్ టైమ్స్ లాంటి దిగ్గజ మీడియా సంస్థలు ప్రదర్శిస్తున్న పైత్యం.. పెహల్గాంపై వారు ప్రచురిస్తున్న వార్తలు మొత్తం మిగిలిన వారికి భిన్నంగా.. వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. పహల్గాం దాడి తర్వాత ప్రచురించిన మొదటి వార్త నుంచి ఈ దాడిని మిలిటెంట్ల దాడిగానో.. గన్ మెన్ దాడి అన్నట్లుగా తమ వార్తా కథనాల శీర్షికల్ని పెట్టటం గమనార్హం. ఉగ్రవాదులకు.. మిలిటెంట్లకు ఉన్న తేడా తెలిసిందే. అందరికి తెలిసిన ఉగ్రవాదుల అర్థాన్ని వదిలేస్తే.. మిలిటెంట్లు అంటే.. స్వదేశంలోని తిరుగుబాటుదారులుగా.. గన్ మెన్లు అంటే.. ఆయుధాల్ని చేతపట్టిన మామూలు వ్యక్తులు అన్నట్లుగా వార్తలు ఇవ్వటం వెనుకు ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్న.
పక్షపాతంగా వార్తలు ఇవ్వాలని కోరుకోవటం లేదు. కనీసం పారదర్శకంగా వార్తలు ఇవ్వాలన్న ఇంగితం ఏమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పహల్గాం ఉదంతంపై అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన ద టైమ్స్ పెట్టిన శీర్షికనే తీసుకుంటే.. 24 మందికి తక్కువ కాకుండా కశ్మీర్ లో ఆయుధ దాడిలో మరణించినట్లుగా ‘ద న్యూయార్క్ టైమ్స్’ తన వార్తా శీర్షికకు పెట్టింది.
దీనిపై అమెరికా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ మెజార్టీ తన పోస్టులో.. ‘హే న్యూయార్క్ టైమ్స్.. మేం దీన్నిమీ కోసం సరి చేశాం.
ఇది చాలా స్పష్టంగా.. క్లియర్ గా కనిపించే ఒక ఉగ్రదాడి. భారత్ అయినా.. ఇజ్రాయెల్ అయినా ఉగ్రవాదం విషయంలో న్యూయారక్ టైమ్స్ వాస్తవికత నుంచి దూరంగా ఉంది’ అంటూ లాగి పెట్టి ఒక్కటి ఇచ్చినట్లుగా పోస్టు పెట్టారు. దీనికి స్క్రీన్ షాట్లను చేర్చారు. కొన్ని ప్రాశ్చాత్య మీడియా సంస్థలు కశ్మీర్ కు సంబంధించిన వార్తల్ని ప్రచురించాల్సి వస్తే.. ఇప్పటికి భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్ అని రాస్తుంటాయి.
ఈ తరహా పైత్యాన్ని ప్రదర్శించే మీడియా సంస్థల్ని సైతం ఊరికే వదిలపెట్టకూడదు. ఇలాంటి వారు ప్రపంచానికి అందించే పైత్యం వార్తలపై అసలు నిజాలను షేర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారానికి సోషల్ మీడియాలో ఉతికి ఆరేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. భారతీయులు సదరు మీడియా సంస్థల్ని బహిష్కరించే చందంలో.. తమ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయటం.. యాప్ లను డౌన్ లోడ్ చేసి వినియోగిస్తుంటే.. వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంది. అంతేకాదు.. పెద్ద ఎత్తున యూట్యూబర్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెనర్లు సైతం రంగంలోకి దిగి.. తోపు మీడియా సంస్థలకు నిజాల్ని చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ మొత్తం ఉదంతాన్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ‘‘ఈ అంతర్జాతీయ మీడియా సంస్థలకు కాస్త కళ్లు తెరుచుకొని చూడమని చెప్పండ్రా’ అంటూ రావు రమేశ్ మాదిరి చెప్పాలని. కాదంటారా?