దువ్వాడకు వైసీపీలో దారులు మూసేసిందెవరు ?
దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లాలో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాల క్రితం చేరి ఎదిగిన ఆయన 2006 లో తొలిసారి జెడ్పీటీసీ అయ్యారు.
By: Satya P | 8 April 2026 4:00 PM ISTదువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లాలో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాల క్రితం చేరి ఎదిగిన ఆయన 2006 లో తొలిసారి జెడ్పీటీసీ అయ్యారు. వైఎస్సార్ ఆశీస్సులతో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కూడా అయ్యారు. ఆ మీదట తన పోరాట పటిమతో వేగంగా ఎదిగారు. 2009 లో ఆయన ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ని ప్రజారాజ్యం పార్టీ నుంచి సాధించి తన సొంత నియోజకవర్గం టెక్కలి నుంచి పోటీ చేశారు. ఇక 2014 కి ముందు వైసీపీలో చేరి మరోసారి అదే సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు, 2019లో శ్రీకాకుళం ఎంపీగా 2024 లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేశారు. పార్టీ ఆ విధంగా ఆయనకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. అంతే కాదు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. అయితే దువ్వాడ తనదైన దూకుడు రాజకీయాలతో పాటు వ్యక్తిగత సమస్యలతో రాజకీయంగా ఇబ్బందులు పాలయ్యారు అన్న చర్చ కూడా ఉంది.
బలమైన నేతగా ఉన్నా :
శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం బలంగా ఉంది. తమ్మినేని సీతారాం లాంటి వారు ఆ సామాజిక వర్గం నుంచి ఎదిగారు. అలాగే ఎందరో నేతలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు. దువ్వాడకు కూడా అటువంటి భవిష్యత్తు ఉంది కానీ ఆయన సొంత పార్టీ నేతలతోనే విభేదాలు పెట్టుకోవడంతో పాటు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వల్ల మంచి ఫ్యూచర్ ని కాకుండా చేసుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక దువ్వాడ ఇబ్బందుల్లో పడడం చూసిన సొంత పార్టీలో ప్రత్యర్థులు సరైన సమయం చూసి వైసీపీ నుంచి దూరం చేసి అలా చెక్ పెట్టించేశారు అని అంటున్నారు.
వైసీపీలోకి నో ఎంట్రీ :
ఇక దువ్వాడ వైసీపీలోకి తిరిగి రావాలని చూస్తున్నారు కానీ ఆయనకు నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నారు అని అంటున్నారు. జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలతో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా వారంతా ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ సీనియర్ నేతలను వదులుకు కేవలం దువ్వాడను మాత్రమే పార్టీలోకి తీసుకోవడానికి వైసీపీ సాహసించదని అంటున్నారు. పైగా దువ్వాడ ఫైర్ బ్రాండ్ రాజకీయం అన్ని వేళలా కుదిరే వ్వ్యవహారం కాదని అంటున్నారు. అందుకే వైసీపీ హై కమాండ్ జిల్లాలోని సీనియర్ల మాటకే పెద్ద పీట వేస్తోంది అని అంటున్నారు దాంతో దువ్వాడ తిరిగి వైసీపీలో చేరే అంశానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని అంటున్నారు.
ధర్మాన బ్రదర్స్ హవా :
వైసీపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులదే హవా అని అంటున్నారు. ఈ ఇద్దరు సోదరులూ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు బలమైన సామాజిక నేపధ్యం అన్నీ కలిసి వైసీపీలో వారికి పెద్ద పీట వేయాల్సిన పరిస్థితి ఉంది. దువ్వాడ విషయం చూస్తే ధర్మాన సోదరులనే టార్గెట్ చేస్తున్నారు వారినే తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో వారితో ఆయన కలసి పనిచేయడం కష్టమే అని తేలిపోతోంది. ఆయన్ని తిరిగి పార్టీలోకి తీసుకున్నా వర్గ పోరు పెంచుకోవడమే అని అంటున్నారు. పైగా ధర్మాన సోదరులతో పాటు జిల్లాలోని మెజారిటీ వైసీపీ నేతలు క్యాడర్ కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దీంతో దువ్వాడని పార్టీలోకి తీసుకోకూడదని హైకమాండ్ నిర్ణయించుకుందని తాజాగా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆశ నెరవేరుతుందా :
ఇక చూస్తే తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమని అధినాయకత్వం నుంచి ఎపుడు పిలుపు వచ్చినా తాను కండువా కప్పుకునేందుకు రెడీ అని దువ్వాడ అంటున్నారు. అయితే దువ్వాడ వస్తే పార్టీలో సీనియర్లతో పాటు చాలా మంది వ్యతిరేకిస్తారు అన్న దాంతోనే హైకమాండ్ నో చెపేస్తోంది అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక దువ్వాడ వైసీపీలో చేరుతాను ఎమంల్యే అభ్యర్ధిగా టెక్కలి నుంచి పోటీ చేస్తాను అని చెబుతున్న మాటలు ఆయన ఆశలు నెరవేరుతాయా అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ప్రస్తుతం జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు చూస్తే కనుక లేవు అనే జవాబు వస్తోంది. మొత్తానికి చూస్తే దువ్వాడ వైసీపీలో చేరకుండా బ్రేకులు పడినట్లే అని అంటున్నారు.
