తెరచాటైన తెలివిగల నేతలు.. జాబితా చాలా పెద్దదే ...!
ఇలా.. రాష్ట్రంలో తెలివిగల నాయకులు చాలా మంది ఉన్నా.. వారంతా ఇప్పుడు తెరమరుగయ్యారనే చెప్పాలి.
By: Tupaki Desk | 9 July 2025 8:15 AM ISTరాజకీయాల్లోకి తెలివిగల నాయకులు రావాలన్నది అందరూ కోరుకునే మాట. చదువుకున్న వస్తే మరీ మంచిదని చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు కూడా చెబుతారు. చదువుకున్నవారు.. తెలివి గల వారు వస్తే.. రాష్ట్రంతోపాటు.. రాజకీయాలు కూడా డెవలప్ అవుతాయని అంటారు. అయితే.. ఇలా తెలివిగల నాయకులు అసలు రాజకీయాల్లో లేరా? అంటే.. ఉన్నారు. కానీ.. అలా వచ్చిన వారు కూడా అనేక పొరపాట్లు చేయడం వల్లో.. గ్రహపాటు వల్లో.. మొత్తానికి తెరమరుగు అయ్యారు.
డీఎల్ రవీంద్రారెడ్డి. కడప జిల్లా మైదుకూరు నుంచి గెలుపే తప్ప ఓటమిఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న డీఎల్.. ప్రముఖ వైద్యుడు అన్న విషయం చాలా మంది తెలియదు. అక్కడి వారికి మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు సేవ అందించారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత.. సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన తెరమరుగయ్యారు. ఇక, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా.. ఈ జాబితాలో వ్యక్తే.
ఆయన వ్యక్తిగతంగా న్యాయవాది. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతేకాదు.. బూతద్దం పెట్టి వెతికినా.. అవినీతి, అక్రమాలువంటివి ఆయన రాజకీయ జీవితంలో కనిపించవు. కానీ.. వైసీపీలో చేరి.. ఆ తర్వాత.. చేసిన కొన్ని పనుల కారణంగా ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఉన్నా.. అధినేత ఆదేశాలను బీరు పోకుండా పాటించి.. పలుచనయ్యారన్న వాదన ఆళ్ల విషయంలో స్పస్టంగా కనిపిస్తుంది.
ఇక, ధర్మాన ప్రసాదరావు. ఈయన ఇంజనీర్. ఈ విషయం కూడా చాలా మంది రాజకీయాల్లో ఉన్నవారికే తెలియదంటే ఆశ్చర్యంవేస్తుంది. నిదానస్తుడు. తెలివిగల నాయకుడిగా మంచి మార్కులు వేయించుకు న్నారు. దివంగత రోశయ్య వంటివారి నుంచి ప్రశంసలు అందుకున్న కొద్దిమందినాయకుల్లో ధర్మాన ఒకరు. కానీ.. అనుకున్నది సాధించలేక పోవడం, అసంతృప్తి కారణంగా.. ఆయన కూడా రాజకీయాల్లో దూరమయ్యారు.
ఇలా.. రాష్ట్రంలో తెలివిగల నాయకులు చాలా మంది ఉన్నా.. వారంతా ఇప్పుడు తెరమరుగయ్యారనే చెప్పాలి. ఇప్పుడున్నవారిలో కూడా విద్యాధికులు.. డాక్టర్లు ఉన్నారు. అయితే..వారు ఇంకా పుంజుకోవాల్సి న అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. వీరిని చూసి వారు తమను తాము మలుచుకునే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
