Begin typing your search above and press return to search.

సమయం మారి.. సమాచారం లీకై.. ఖమేనీపై ఖచ్చిత దాడి ఎలా సాధ్యమైంది?

పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేసిన తాజా పరిణామంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై జరిగిన గురిచూసి కొట్టిన దాడి వెనుక నిఘా వ్యవస్థల పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ముదురుతున్నాయి.

By:  A.N.Kumar   |   1 March 2026 8:40 PM IST
సమయం మారి.. సమాచారం లీకై.. ఖమేనీపై ఖచ్చిత దాడి ఎలా సాధ్యమైంది?
X

పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేసిన తాజా పరిణామంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై జరిగిన గురిచూసి కొట్టిన దాడి వెనుక నిఘా వ్యవస్థల పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ముదురుతున్నాయి. సమయం మారడం, అంతర్గత సమాచారం లీక్ కావడం వంటి అంశాలు ఈ దాడికి కీలక కారణాలుగా మారినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలతో కలిసి ఖమేనీ కదలికలను నెలల తరబడి నిశితంగా గమనించిందని సమాచారం.

సాధారణంగా ఇలాంటి హైప్రొఫైల్ లక్ష్యాలపై దాడులు ఒక్కసారిగా జరగవు. దీని వెనుక నెలల తరబడి సేకరించిన సమాచారం, డిజిటల్ ట్రాకింగ్, మానవ నిఘా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఖమేనీ పాల్గొనబోయే కీలక సమావేశం గురించి ముందస్తుగా సమాచారం లభించినప్పటికీ అది ఏ భవనంలో జరుగుతుందో స్పష్టత లేకపోవడం ఆపరేషన్‌ను కొంతకాలం వాయిదా వేసేలా చేసింది. ఇదే సమయంలో సమావేశ సమయం అకస్మాత్తుగా మారడం.. ఆ మార్పు వివరాలు లీక్ కావడం దాడికి మార్గం సుగమం చేసిన కీలక మలుపుగా నిలిచింది.

ఇక్కడ "సమాచారం లీక్" అనే అంశం అత్యంత ప్రాధాన్యత పొందుతోంది. ఇరాన్ వంటి కఠిన భద్రతా వ్యవస్థలున్న దేశంలో ఇలాంటి సున్నిత సమాచారం బయటకు రావడం అంతర్గత భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట లోపం, లేదా అంతర్గతంగా సహకారం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం ఇరాన్ పాలనా వ్యవస్థలో నమ్మకం, భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు ఈ దాడి ఆధునిక యుద్ధ వ్యూహాలలో సాంకేతికత ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది. ఉపగ్రహ నిఘా, కమ్యూనికేషన్ ట్రాకింగ్, సైబర్ ఇంటెలిజెన్స్ ఇలా అన్నీ కలిపి ఒక ఖచ్చితమైన దాడి కోసం ఉపయోగించబడ్డాయి. సమయం, ప్రదేశం ఖచ్చితంగా తెలిసిన తర్వాతే ఆపరేషన్ అమలు చేయబడినట్లు తెలుస్తోంది. ఇది సాంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా "ఇంటెలిజెన్స్ ఆధారిత లక్ష్యిత దాడులు" అనే కొత్త ధోరణిని ప్రతిబింబిస్తోంది.

అయితే ఈ ఘటనతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున పశ్చిమాసియా మొత్తం అస్థిరతలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉంది.

మొత్తం మీద సమయం మార్పు, సమాచారం లీక్, నిఘా వ్యవస్థల సమన్వయం అన్ని కలిసి ఈ దాడిని సాధ్యంచేశాయి. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, గ్లోబల్ పవర్ గేమ్‌లో కొత్త దశకు సంకేతంగా మారింది. ఇకపై యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే కాకుండా సమాచారం, నిఘా, సాంకేతికతల మేళవింపుతో సాగనున్నాయనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది.