Begin typing your search above and press return to search.

సైలెంట్ కిల్లర్.. ‘ఐఎన్ఎస్ అరిధమన్’ - సముద్రంలో ఆట మారినట్లే..

భారత నేవీ మరింత శక్తిమంతం కానుంది. సైలెంటుగా శత్రువు ఆట కట్టించే అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధమన్’ మన నేవీ సొంతం కానుంది.

By:  Tupaki Political Desk   |   23 Feb 2026 1:00 AM IST
సైలెంట్ కిల్లర్.. ‘ఐఎన్ఎస్ అరిధమన్’ - సముద్రంలో ఆట మారినట్లే..
X

భారత నేవీ మరింత శక్తిమంతం కానుంది. సైలెంటుగా శత్రువు ఆట కట్టించే అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధమన్’ మన నేవీ సొంతం కానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడో అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధమన్’. దీని రాకతో హిందూ మహాసముద్రంలో భారత్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించనుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నేవీ అమ్ములపొదిలో ‘ఐఎన్ఎస్ అరిధమన్’ చేరనుంది. దీంతో భూమి, ఆకాశం తర్వాత సముద్ర మార్గంలో కూడా అణు దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత్ స్వయం సమృద్ధి సాధించినట్టు అవుతుందని చెబుతున్నారు.

‘ఐఎన్ఎస్ అరిధమన్’ మరో రెండు నెలల్లో నౌకాదళంలో చేరనుందని చెబుతున్నారు. విశాఖపట్నం నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ లో నిర్మిస్తున్న ‘ఐఎన్ఎస్ అరిధమన్’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. అడ్వాన్సడ్ టెక్నాలజీ వెజల్ - ఏవీటీ ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తున్నారు. తొలుత రష్యా సహకారంతో ఐఎన్ఎస్ అరిహంత్ ను నిర్మించి నేవీకి సమకూర్చారు. ఇది దశాబ్ద కాలం నుంచి సేవలు అందిస్తోంది. రెండోది అయిన ఐఎన్ఎస్ అరిఘాత్ ను 2024 ఆగస్టులో జాతికి అంకితం చేశారు. అదే సిరీస్ లో మూడోదైన ఐఎన్ఎస్ అరిధమన్ సముద్ర పరీక్షలన్ని పూర్తి చేసుకుని సేవలకు సిద్ధమవుతోంది.

మరో రెండు నెలల్లో నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఐఎన్ఎస్ అరిధమన్ సబ్ మెరెన్ ను స్ట్రాటజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్ మెరైన్ కేటగిరీకి చెందినవిగా చెబుతున్నారు. 130 మీటర్ల పొడవు, 11 మీటర్ల బీమ్ వెడల్పు ఉన్న అరిధమన్ డ్రాఫ్ట్ సుమారు 10 మీటర్లు ఉంటుంది. ఇది సముద్ర ఉపరితలంపై ఉన్నప్పుడు ఆరు వేల టన్నులు, లోపల ఉన్నప్పుడు ఏడు వేల టన్నుల బరువును తరలించగలుగుతుంది. అధికారులు, నావికులు కలిపి 95 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ల వేగంతోను, సముద్రం లోపల గంటకు 2 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

అవసరమైన ఇంధనం, సిబ్బందికి ఆహారం సమకూరిస్తే ఎంత దూరమైనా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉందని అంటున్నారు. 83 మెగావాట్ సామర్థ్యం కలిగి నీటి ఒత్తిడితో పనిచేసే సీఎల్ డబ్ల్యూఆర్-బి1 రియాక్టర్ ను అమర్చారు. ఇందులో బాలిస్టిక్ మిస్సైళ్లను నిట్టనిలువుగా ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయి. అరిధమన్ రాకతో భారత నౌకాదళ శక్తి రెట్టింపు అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలకంగా పనిచేయనుందని అంటున్నారు. సముద్రం అడుగున దాగి ఉండి శత్రువుకు గట్టిగా సమాధానం చెప్పడానికి అరిధమన్ రక్షణ కవచంలా పనిచేయనుందని చెబుతున్నారు.