Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ కు ఇంకా తగ్గలేదు... భారత్ కు వార్నింగ్!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టకముందు తీసుకున్న పలు దౌత్యపరమైన నిర్ణయాల్లో సింధూ జలాల ఒప్పందం రద్దు అంశం ఒకటి.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:54 AM IST
పాకిస్థాన్ కు ఇంకా తగ్గలేదు... భారత్ కు వార్నింగ్!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టకముందు తీసుకున్న పలు దౌత్యపరమైన నిర్ణయాల్లో సింధూ జలాల ఒప్పందం రద్దు అంశం ఒకటి. దీంతో.. త్వరలో పాక్ గొంతెండుతుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో.. పాక్ లో ఈ మేరకు ఆందోళనలు రేగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పాక్ కు నీరివ్వకపోతే భారత్ పై యుద్ధమే అంటూ ప్రగల్భాలు పలుకుతోంది పాక్!

అవును... సింధు జలాల ఒప్పందం కింద తమకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా ఇచ్చేందుకు భారత్‌ నిరాకరిస్తే తమ దేశం యుద్ధానికి వెళ్తుందని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ హెచ్చరించారు. ఇదే సమయంలో... సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా భారతదేశానికి రెండు ఎంపికలు ఉన్నాయని చెప్పిన బిలావల్... జలాలను న్యాయంగా తమతో పంచుకోవడం.. లేదంటే, తాము సింధు పరివాహక ప్రాంతంలోని ఆరు నదుల నుంచి నీటిని తీసుకుంటామని చెప్పారు. సింధూ నదీ జలాల ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని ఆయన అన్నారు. నీటిని ఆపే బెదిరింపు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం చట్టవిరుద్ధమని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... పాకిస్థాన్‌ తో చర్చలకు భారత్‌ నిరాకరిస్తే, ఉగ్రవాదంపై సమన్వయం లేకపోతే, రెండు దేశాలలో హింస మరింత తీవ్రమవుతుందని చెప్పిన బిలావల్.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని భారత్‌ ఓ ఆయుధంగా ఉపయోగిస్తోందని విమర్శించారు. కశ్మీర్‌ సమస్యను ప్రపంచ వేదికపై లేవనెత్తడంలో పాకిస్థాన్‌ విజయం సాధించిందని చెప్పుకున్నారు.

కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత 1960 నాటి సింధూ జలాల భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల స్పందించిన కేంద్ర హోమంత్రి... నిలిపివేసిన నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ ఎప్పటికీ పునరుద్ధరించదని ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం కొన్ని రోజులకు బిలావల్ భుట్టో ఈ విధంగా స్పందించారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా... పాక్ తో సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ప్రతీ అంశంలోనూ భారత్ పైచేయి సాధించి, పాక్ ను వణికించడంతో.. ఆ దేశం కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరిచారో ఏమో కానీ.. బిలావల్ భారత్ కు యుద్ధ హెచ్చరికలు చేయడం గమనార్హం!