ఇండియన్స్ ఎక్కువ వెళ్లే బాలిలో ఊహకందని ప్రమాదం
ఇండోనేసియాలోని బాలి ద్వీపం సమీపంలో చోటుచేసుకున్న ఘోర ఫెర్రీ ప్రమాదం పర్యాటకులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Desk | 3 July 2025 1:09 PM ISTఇండోనేసియాలోని బాలి ద్వీపం సమీపంలో చోటుచేసుకున్న ఘోర ఫెర్రీ ప్రమాదం పర్యాటకులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తూర్పు జావాలోని కేటాపాంగ్ పోర్టు నుంచి బాలి ద్వీపంలోని గిలిమనుక్‌కు వెళ్తున్న ఒక ఫెర్రీ సముద్రంలో మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 38 మంది గల్లంతయ్యారు.
ప్రమాదానికి గురైన ఫెర్రీలో మొత్తం 65 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. దాంతో పాటు 22 వాహనాలు, 14 ట్రక్కులు కూడా ఫెర్రీలో లోడ్ చేయబడి ఉన్నాయి. ప్రయాణం ప్రారంభమైన 30 నిమిషాల వ్యవధిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. 23 మందిని అపస్మారక స్థితిలో సముద్రం నుంచి రక్షించగలిగారు. మిగిలిన 38 మంది ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, సముద్రంలో భారీ అలలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు.
గత విషాదాలు మళ్లీ గుర్తుకు..
ఇండోనేసియా ఒక ద్వీప దేశం కావడంతో, ప్రజల రవాణాకు ఫెర్రీలు, పడవలు ఇక్కడ ప్రధాన సాధనాలు. అయితే, తరచు భద్రతా ప్రమాణాలను విస్మరించడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2018లో జరిగిన ఒక ఇలాంటి విషాదకర ఘటనను ఈ తాజా ప్రమాదం మళ్లీ గుర్తు చేసింది. సామర్థ్యానికి మించి ప్రయాణించిన ఒక పడవ బోల్తా పడగా, అందులో ఉన్న 200 మందిలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా ప్రమాదంపై ఇండోనేసియా ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గల్లంతైన వారి కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చింది.
ఈ ఘటన ఇండోనేసియాలో ఫెర్రీ రవాణా భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
