ఫెర్రీలో భారీ మంటలు.. సముద్రంలోకి దూకిన ప్రయాణికులు.. వైరల్ వీడియో!
అవును... సముద్రంలో భయంకరంగా ఎగసిపడుతున్న మంటల్లో చిక్కుకున్న ఫెర్రీ ఒక్కసారిగా షాకింగ్ ఘటనగా మారింది.
By: Tupaki Desk | 21 July 2025 9:54 AM ISTఇండోనేసియాలో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఫెర్రీలో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మృతుల్లో ఓ గర్భిణీ ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. 568 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.
అవును... సముద్రంలో భయంకరంగా ఎగసిపడుతున్న మంటల్లో చిక్కుకున్న ఫెర్రీ ఒక్కసారిగా షాకింగ్ ఘటనగా మారింది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది అదృష్టవశాత్తు 568 మందిని రక్షించినట్లు చెబుతున్నారు. అయితే.. దురదృష్టవశాత్తు ఓ గర్భిణీ మహిళతో పాటు ముగ్గురు మృతి చెందారు! దీనిపై మనాడో నేవీ బేస్ చీఫ్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫ్రాంకీ పసునా సిహోంబింగ్ తాజా అప్ డేట్స్ ఇచ్చారు.
వివారాళ్లోకి వెళ్తే... తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు 'కేఎం బార్సిలోనా 5' ఫెర్రీ బయలుదేరింది. ఈ క్రమంలో ఆ ఫెర్రీ తలిసే ప్రాంతానికి చేరుకున్న సమయంలో అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై, హాహాకారాలు చేస్తూ నీటిలో దూకారు. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగింది.
ఈ సందర్భంగా స్పందించిన మనాడో నేవీ బేస్ చీఫ్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్... ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని తెలిపారు. సహాయక చర్యలో ఒక కోస్ట్ గార్డ్ షిప్, ఆరు రెస్క్యూ నౌకలు, అనేక ఎయిర్ బోట్లు మోహరించబడ్డాయని చెప్పారు. ఇదే సమయంలో స్థానిక జాలర్లు కూడా లైఫ్ జాకెట్లు ధరించి కొంతమందిని రక్షించారని తెలిపారు.
అయితే ఈ ఘటనలో అధికారులు తొలుత ఐదుగురు మరణించారని చెప్పారు. అయితే.. సోమవారం తెల్లవారుజామున నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ స్పందిస్తూ.. ముగ్గురు మాత్రమే మరణించారని.. ఇద్దరు ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో రెండు నెలల శిశువు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... ఫెర్రీలో తొలుత 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని చెప్పగా... జాతీయ రెస్క్యూ ఏజెన్సీ తాజా అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. 600 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఫెర్రీలో 568 మంది ప్రాణాలతో బయటపడగా.. ముగ్గురు మృతి చెందినట్లు స్పష్టం చేసింది.
