అమెరికాలో భారతీయుల ప్రతిష్టకు మచ్చ: విజయాల వెనుక పెరుగుతున్న నేరాల నీడ
అయితే గడిచిన కొద్ది కాలంగా వెలుగులోకి వస్తున్న కొన్ని చేదు సంఘటనలు ఈ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి.
By: A.N.Kumar | 20 March 2026 4:00 PM ISTఅమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయ మేధస్సు గర్వకారణంగా నిలుస్తోంది. రాజకీయాల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు.. సిలికాన్ వ్యాలీ నుంచి వైట్ హౌస్ వరకు భారతీయులు తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ నిపుణులు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో కీలక పాత్రలు పోషిస్తూ దేశ ప్రతిష్టను హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. అయితే గడిచిన కొద్ది కాలంగా వెలుగులోకి వస్తున్న కొన్ని చేదు సంఘటనలు ఈ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. కొందరి వికృత చేష్టలు, స్వార్థపూరిత నేరాలు మొత్తం సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.
న్యూమెక్సికో ఘటన: తెలుగు వ్యక్తి అరెస్టుతో కలకలం
తాజాగా న్యూమెక్సికోలో జరిగిన ఒక అండర్‌కవర్ ఆపరేషన్ భారతీయ సమాజాన్ని ముఖ్యంగా తెలుగు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. మైనర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న లైంగిక దోపిడీని అరికట్టేందుకు అమెరికా పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆశ్చర్యకరంగా ఇందులో భారతదేశానికి చెందిన బాల్కం నాగరాజు అనే తెలుగు వ్యక్తి ఉండటం చర్చనీయాంశమైంది.
పోలీసులు సోషల్ మీడియాలో మైనర్లుగా నటిస్తూ నకిలీ ఖాతాల ద్వారా వల పన్నారు. ఈ ఉచ్చులో చిక్కిన నిందితులు, మైనర్లతో అసభ్యకరంగా చాట్ చేయడమే కాకుండా వారిని కలిసేందుకు ప్రయత్నించిన సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఇలాంటి అసహ్యకరమైన నేరాలకు పాల్పడటం విదేశాల్లో ఉన్న భారతీయుల నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
"వోర్స్ట్ ఆఫ్ ది వోర్స్ట్" జాబితాలో భారతీయులు
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్ల జాబితా. “వరస్ట్ ఆఫ్ ది వరస్ట్” పేరుతో ఉన్న ఈ క్రిమినల్స్ లిస్టులో సుమారు 89 మందికి పైగా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉండటం గమనార్హం. ఇందులో ఆర్థిక నేరాలు, వీసా మోసాలు, సైబర్ క్రైమ్స్ నుంచి తీవ్రమైన హింసాత్మక నేరాల వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫోటోలు, పూర్తి వివరాలతో సహా ఈ జాబితా బహిరంగంగా ఉండటం వల్ల భారతీయుల పట్ల స్థానికుల్లో ఉన్న గౌరవం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం
ఒక వ్యక్తి చేసే తప్పు వల్ల మొత్తం సమాజానికి నేరస్థులనే ముద్ర పడకపోయినా జాత్యహంకార దాడులకు లేదా వివక్షకు ఇది సాకుగా మారే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే యువత కేవలం సంపాదనపైనే దృష్టి పెడుతూ అక్కడి చట్టాలు, నైతిక విలువల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్న లక్షలాది మంది భారతీయుల కృషిని ఇటువంటి ఘటనలు నీరుగారుస్తున్నాయి. ఇలాంటి వార్తలు టెక్ కంపెనీలలో భారతీయుల పట్ల నమ్మకాన్ని తగ్గించే అవకాశం ఉంది.
మేల్కోవాల్సిన సమయం
మంచి పేరు సంపాదించడానికి దశాబ్దాల కాలం పడితే దానిని పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలు. అమెరికాలో ఉన్న భారతీయ సంఘాలు, ముఖ్యంగా తెలుగు అసోసియేషన్లు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా యువతలో చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నా మన మూలాలను, మన దేశ గౌరవాన్ని మర్చిపోకూడదు. చట్టాన్ని అతిక్రమిస్తే అది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, దేశ ప్రతిష్టకు తీరని ద్రోహంగా చెప్పొచ్చు. ప్రతి భారతీయుడు ఒక రాయబారిలా ప్రవర్తించినప్పుడే గ్లోబల్ స్థాయిలో మనకు దక్కిన గౌరవం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.
