Begin typing your search above and press return to search.

మరోసారి చుక్కలు చూపించిన ఇండిగో

హైదరాబాద్ నుంచి దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన దేశీయ సర్వీసుల విషయంలో ఇండిగో టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   3 May 2024 4:14 AM GMT
మరోసారి చుక్కలు చూపించిన ఇండిగో
X

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక వివాదంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పేరు నానుతోంది. ప్రయాణికులకు సేవలు అందించే విషయంలో ఈ ఎయిర్ లైన్స్ మీద ఫిర్యాదులు ఇటీవల అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగోకు చెందిన విమానాలు.. తమ ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన వైనంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తప్పు ఇండిగో సంస్థది కాగా.. దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది మాత్రం ప్రయాణికులేనని చెబుతున్నారు. ఇండిగో సంస్థ సర్వర్ డౌన్ అయ్యిందని.. ఈ కారణంగానే ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండా ముందుగానే గేట్లు మూసేశారని.. ప్రయాణికులు ప్రాధేయపడ్డా అనుమతించలేదని చెబుతున్నారు.

హైదరాబాద్ నుంచి దేశీయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన దేశీయ సర్వీసుల విషయంలో ఇండిగో టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలువురు ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకొని వెబ్ చెకిన్ చేసుకునేందుకు ప్రయత్నించగా సదరు సంస్థ సర్వర్ పని చేయలేదు. టికెట్లు చేతిలో ఉన్నప్పటికీ.. వెబ్ చెకిన్ కాకపోవటంతో ప్రయాణికులు వివరాలు తమకు అందలేదని.. వారిని తాము అనుమతించమని ఇండిగో సిబ్బంది తేల్చి చెప్పారు.

దీంతో.. పలువురు తాము ప్రయాణించాల్సిన ఫ్లైట్లలో ప్రయాణించలేని పరిస్థితి. ఇండిగో సిబ్బంది తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పలువురు ప్రయాణికులు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేస్తూ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి పెద్ద ఎత్తున సర్క్యులేట్ కావటంతో ఇండిగో దిగి వచ్చింది. వేరే సర్వీసుల్లో ఇబ్బందులకు గురైన ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తామని హామీ ఇచ్చింది.

అయితే.. కనెక్టింగ్ ఫ్లైట్లతో ప్రయాణాలు చేయాల్సిన వారు మాత్రం తమకు భారీ నష్టం వాటిల్లిందన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలు మీడియా సంస్థలు ఇండిగో అధికారుల్ని సంప్రదించే ప్రయత్నం చేయగా.. ప్రయాణికులు ఎదుర్కొన్న సమస్యలు తమ వరకు రాలేదని వ్యాఖ్యానించటం గమనార్హం.