Begin typing your search above and press return to search.

హనీమూన్ కు అలస్యమవుతుందనే కోపమే పైలెట్ మీద దాడి?

ఇండిగో పైలెట్ మీద దాడి చేసిన ప్రయాణికుడి ఉదంతం షాకింగ్ గా మారటం.. అతడి తీరును పలువరు ఖండించటం తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:23 AM GMT
హనీమూన్ కు అలస్యమవుతుందనే కోపమే పైలెట్ మీద దాడి?
X

ఇండిగో పైలెట్ మీద దాడి చేసిన ప్రయాణికుడి ఉదంతం షాకింగ్ గా మారటం.. అతడి తీరును పలువరు ఖండించటం తెలిసిందే. ఇంతకూ అతను అలా ఎందుకు చేశాడు? అన్న ప్రశ్నకు అతడి వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను ప్రయాణించాల్సిన గోవా ఫ్లైట్ 13 గంటల ఆలస్యమే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థాయికి తీసుకెళ్లినట్లుగా సదరు ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఐదు నెలల క్రితం పెళ్లై.. హనీమూన్ కు వెళ్లాల్సిన వేళ.. విమానం 13 గంటలు ఆలస్యం కావటమే తన ఫస్ట్రేషన్ కు కారణమని పేర్కొన్నాడు. అదుపులోకి తీసుకున్న అతన్ని బెయిల్ ఇచ్చి పంపటం తెలిసిందే.

ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లాల్సిన ఇండిగో ప్లైట్ లో కోపైలెట్ అనుప్ కుమార్ పై సాహిల్ కటారియా దాడి చేయటం తెలిసిందే. విమాన ఆలస్యంపై ప్రకటన చేస్తున్న అతడిపై ఆవేశంతో దూసుకొచ్చిన సాహిల్.. నడిపితే నడుపు.. లేదంటే ఫ్లైట్ తలుపులు తియ్యండంటూ అరిచిన వైనం వైరల్ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఫ్లైట్ షెడ్యూల్ టైం కంటే దాదాపు 13 గంటలు ఆలస్యం కావటం.. విమానం తలుపులు మూసి గంటల కొద్దీ అందులో ఉంచేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

పైలెట్ పై దాడిని ఎవరూ సమర్థించటం లేదు కానీ.. ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరును మాత్రం తప్పు పడుతున్నారు. ఢిల్లీలో బొమ్మల దుకాణాన్ని నడిపే కటారియా తన హనీమూన్ కోసం గోవాకు వెళుతున్నాడు. ఆదివారం ఉదయం 7.40 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరింది. కటారియా తీరును ఇండిగో తీవ్రంగా తప్పు పట్టింది. అతడిపై చర్యలకు పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు.. మొత్తం ఘటనకు సంబంధించిన ఫస్ట్ హ్యాండ్ సమాచారం పేరుతో అసలేం జరిగిందో పేర్కొన్నాడు. తాను దాడి ఘటనను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించనని స్పష్టం చేసిన సదరు ప్రయాణికుడు.. ఈ ఉదంతం చోటు చేసుకోవటానికి కారణాల్ని కూడా పరిశీలించాలంటూ.. ఆ రోజున ఏం జరిగిందో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విమానంలో సహ ప్రయాణికుడిగా తన అనుభవాన్ని వెల్లడిస్తున్నట్లుగా ఎక్స్ లో తన ప్రయాణ అనుభవాన్ని సుదీర్ఘంగా వివరించారు. ఉదయమే బయలుదేరాల్సిన విమానం.. వాతావరణం బాగోలేని కారణంగా ఐదు గంటల ఆలస్యంతో మధ్యాహ్నం12.20 గంటలకు 186 మంది ప్రయాణికులతో బోర్డింగ్ చేశారని పేర్కొన్నారు.అయితే.. ఎటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నుంచి క్లియరెన్సు రాని కారణంగా.. విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతున్నట్లు చెప్పారని.. కానీ.. ఒక క్రూ మెంబర్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారన్నారు.

మధ్యాహ్నాం 2.40 గంటలకు సదరు క్రూ మెంబర్ వచ్చారని.. విమాన తలుపుల్ని మూసేశారని పేర్కొన్నారు. విమానం తలుపుల్ని మూశారే కానీ.. ఫ్లైట్ మాత్రం బయలుదేరలేదని.. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారన్నారు. గంటల కొద్దీ వెయిట్ చేయించిన ఇండిగో సిబ్బంది.. విమానంలోని ప్రయాణికులకు అవసరమైన మంచినీళ్లు.. ఫుడ్ కూడా ఇవ్వలేదన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే ఫుడ్ సర్వ్ చేశారన్నారు. ఇండిగో సిబ్బంది తీరు ఏ మాత్రం బాగోలేదని.. ఆలస్యానికి కారణాల్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేసే విషయంలో ఫెయిల్ అయ్యారన్నారు. తాను దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనని చెప్పిన అతను.. విమాన ఆలస్యం విషయంలో ఇండిగో తీరును మాత్రం తీవ్రంగా తప్పు పట్టారు.