తిరుపతిలో బయలుదేరి యూటర్న్ తీసుకున్న విమానం... ఏం జరిగిందంటే..!
అవును... ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుండి తెలంగాణలోని హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానం ఆదివారం రాత్రి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి తిరుపతి విమానశ్రయానికి చేరుకుంది.
By: Tupaki Desk | 21 July 2025 11:43 AM ISTగత కొన్ని రోజులుగా వరుసగా విమాన ప్రయాణాలు టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా టెకాఫ్ అయిన తర్వాత గమ్యస్థానానికి చేరేకంటే ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్, తిరిగి టెకాఫ్ అయిన విమానాశ్రయానికే తిరిగి రావడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ సమయంలో తాజాగా తిరుపతి నుంచి బయలుదేరిన విమానం వెంకటగిరిలో యూటర్న తీసుకుని వెనక్కి వెళ్లిపోయింది.
అవును... ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుండి తెలంగాణలోని హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానం ఆదివారం రాత్రి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి తిరుపతి విమానశ్రయానికి చేరుకుంది. అందుకు కారణం.. సాంకేతిక లోపం తలెత్తడమే అని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 7:42 గంటలకు తిరుపతి నుండి బయలుదేరిన విమానం 6ఈ 6591లో మార్గమధ్యలో సాంకేతిక లోపం ఏర్పడింది!
ఫ్లైట్ ట్రాడర్ 24లో విమాన మార్గంలో 6ఈ 6591 విమానం తిరుపతిలోని వెంకటగిరి పట్టణానికి చేరుకుని, యూ-టర్న్ తీసుకున్నట్లు చూపించింది. ఆ తర్వాత అది సుమారు 40 నిమిషాల పాటు గాలిలో తిరుగుతూ, తిరిగి 8:34 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి వచ్చింది! ఆ తర్వాత ఆ విమానం రద్దు చేయబడింది! ఆ రోజు హైదరాబాద్ కు వెళ్లాల్సిన చివరి విమానం ఇదేనని తెలుస్తోంది.
దీంతో ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని, అసౌకర్యాన్ని వ్యక్తం పరిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఇది తిరుపతి నుండి రాత్రి 7:20 గంటలకు బయలుదేరి 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సంఘటనలకు సంబంధించి ఇండిగో ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదని తెలుస్తోంది!
