ఢిల్లీకి తిరిగొచ్చేసిన ఇండిగో విమానం.. కారణం చెప్పిన ఎయిర్ లైన్స్!
అవును... గురువారం ఇంఫాల్ కు బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 17 July 2025 6:08 PM ISTరెండు రోజులుగా ఇండిగో విమానాలు వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. బుధవారం ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత ముంబైకి మళ్లించగా... తాజాగా ఢిల్లీ నుంచి ఇంఫాల్ కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ ప్రకటనలో తెలిపింది.
అవును... గురువారం ఇంఫాల్ కు బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇంఫాల్ కు బయలుదేరిన విమానం 6ఈ 5118.. ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక లోపం ఎదుర్కొంది. దీంతో... ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఇండిగో సంస్థ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... 'ఢిల్లీ నుండి ఇంఫాల్ కు నడుస్తున్న 6ఈ 5118 విమానం టేకాఫ్ అయిన వెంటనే.. అందులో ఒక చిన్న సాంకేతిక లోపం గుర్తించబడింది. ముందుజాగ్రత్త చర్యగా, పైలట్లు వెనక్కి తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు' అని తెలిపారు.
ఇదే సమయంలో... 'తప్పనిసరి విధానాలకు అనుగుణంగా, విమానం అవసరమైన తనిఖీలు నిర్వహించబడింది.. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.. ఎప్పటిలాగే కస్టమర్లు, సిబ్బంది భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది" అని పేర్కొన్నారు.
కాగా... బుధవారం ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత ముంబైకి మళ్లించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. 6ఈ 6271 విమానం గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా.. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
