Begin typing your search above and press return to search.

174 మందితో ఇండిగో విమానం... తృటిలో తప్పిన పెను ప్రమాదం!

అవును... మంగళవారం రాత్రి ఢిల్లీ నుండి పాట్నాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానం (6ఈ 2482) తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది.

By:  Tupaki Desk   |   16 July 2025 12:30 PM IST
174 మందితో ఇండిగో విమానం... తృటిలో తప్పిన పెను ప్రమాదం!
X

ఇటీవల తెరపైకి వస్తోన్న విమానాలకు సంబంధించిన వార్తలు తీవ్ర ఆందోళన కలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విమానాల్లో సాంకేతిక లోపాలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుండి పాట్నాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న ఘటన తెరపైకి వచ్చింది. ఆ విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

అవును... మంగళవారం రాత్రి ఢిల్లీ నుండి పాట్నాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానం (6ఈ 2482) తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. ఇందులో భాగంగా... ల్యాండింగ్ ప్రక్రియలో విమానం రన్‌ వేపై నిర్దేశించిన టచ్‌ డౌన్ పాయింట్ కంటే కొంచెం ముందుకు దిగింది. దీంతో.. మిగిలిన రన్‌ వే పొడవు విమానాన్ని సురక్షితంగా ఆపడానికి సరిపోకపోవచ్చని గ్రహించిన పైలట్, వెంటనే తిరిగి గాల్లోకి లేపి, సకాలంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో సుమారు రెండు మూడు సార్లు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత.. విమానం రాత్రి 9 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో... విమానంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్ అప్రమత్తత, స్పాట్ రియాక్షన్ వెరసి ప్రమాదాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఇక్కడున్న చిన్న రన్ వేలు ల్యాండింగ్ సమయంలో పైలట్ లకు తరచు సవాళ్లను కలిగిస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ ల సంక్లిష్టతకు తోడు.. సచివాలయంలోని ఐకానిక్ క్లాక్ టవర్ విమానాశ్రయానికి సమీపంలో ఉందని.. దీంతో... క్లాక్ టవర్ ఎత్తు కారణంగా విమానాలు ప్రామాణిక 3 డిగ్రీల కంటే 3.25 నుండి 3.5 డిగ్రీల మధ్య ఏటవాలు కోణంలో దిగుతాయని.. ఈ ఏటవాలు విధానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.