Begin typing your search above and press return to search.

లోకేశ్ పర్యవేక్షణలో విమానయానశాఖ..? టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై జాతీయస్థాయి చర్చ

ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి, సీడాప్ చైర్మన్ జి.దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి

By:  Tupaki Desk   |   6 Dec 2025 12:04 PM IST
లోకేశ్ పర్యవేక్షణలో విమానయానశాఖ..? టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై జాతీయస్థాయి చర్చ
X

ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి, సీడాప్ చైర్మన్ జి.దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయంపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. ఇండిగో సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రముఖ జాతీయ చానల్ రిపబ్లిక్ టీవీలో డిబేట్ జరిగింది. ఈ చర్చా కార్యక్రమానికి టీడీపీ తరఫున సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి హాజరయ్యారు.

ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై ఈ చర్చ సాగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డిని ప్రయాణికుల భద్రతపై స్పందించాల్సిందిగా డిబేట్ నిర్వహిస్తున్న ప్రముఖ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి కోరారు. ఈ విషయంపై స్పందించిన దీపక్ రెడ్డి.. తమ పార్టీ నేత, మంత్రి నారా లోకేశ్ సంక్షోభం నివారణకు పనిచేస్తున్నారని, అత్యావసరంగా వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. దీపక్ రెడ్డి వివరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్నబ్ గోస్వామి.. మంత్రి నారా లోకేశ్ కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కాదు కదా? అంటూ ప్రశ్నించడంతో టీడీపీ అధికార ప్రతినిధి కంగుతినాల్సివచ్చిందని అంటున్నారు.

నారా లోకేశ్ ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశమో లేక ఆయన కూడా ఇండిగో సంక్షోభం నివారణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి పనిచేస్తున్నారని చెప్పాలని అనుకున్నారో కానీ, దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కేవలం ఉత్సవం విగ్రహంలా చూపినట్లు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్ పర్యవేక్షిస్తున్నారని చెప్పిన దీపక్ రెడ్డి, ఆర్నబ్ గోస్వామి అభ్యంతరం చెప్పిన తర్వాత కూడా తాను చేసిన పొరపాటను గ్రహించలేదని అంటున్నారు.

దీపక్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి.. పలు ప్రశ్నలు సంధించారు. నారా లోకేశ్ కు ఏ హక్కు ఉందని సివిల్ ఏవియేషన్ డిపార్టుమెంటులో జోక్యం చేసుకుంటున్నారు? సివిల్ ఏవియేషన్ అనేది టీడీపీ మంత్రిత్వ శాఖ కాదు కదా? అంటూ వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక రాష్ట్ర మంత్రి కేంద్ర ప్రభుత్వంలోని సివిల్ ఏవియేషన్ శాఖను ఎలా పర్యవేక్షిస్తారంటూ రెట్టిస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. మీ పార్టీ ఇందులో ఎలా జోక్యం చేసుకుంటుందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిబేట్ వాడివేడిగా మారిపోయింది. జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి వేసిన ప్రశ్నలను వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. రామ్మోహన్ నాయుడును కీలు బొమ్మ చేసి ఆడుకుంటున్నారని, నిజమైన అధికారం మొత్తం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వద్దే ఉంచుకున్నారని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.