కనీస మానవత్వం చూపని పాకిస్తాన్ ? విమానం కూలుతుందన్నా దయ చూపలేదు!
బుధవారం ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం 6E 2142లో 220 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు.
By: Tupaki Desk | 23 May 2025 3:47 PM ISTభారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత మరింత ఆందోళనకరంగా మారాయి. సింధు నది జలాలను నిలిపివేసి భారత్ కఠినంగా వ్యవహరిస్తుంటే, పాకిస్తాన్ అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. తాజాగా, ఒక ఇండిగో విమానానికి సంబంధించిన సంఘటన పాకిస్తాన్ వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటింది. 220 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అత్యవసర స్థితిలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించడం తీవ్ర చర్చకు దారితీసింది. బుధవారం ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం 6E 2142లో 220 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు. విమానం తన గమ్యస్థానమైన శ్రీనగర్‌కు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శ్రీనగర్ గగనతలంలో ఉన్నట్టుండి గాలి ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీనితో విమానం విపరీతమైన కుదుపులకు లోనైంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పరిస్థితి చేయిదాటిపోతుండడంతో విమాన పైలట్ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, శ్రీనగర్‌లో వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు విమానం పాకిస్తాన్ గగనతలంలోకి కొద్ది దూరం వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ విషమ పరిస్థితుల్లో ఇండిగో విమాన పైలట్ పాకిస్తాన్‌లోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను అనుమతి కోరాడు. విమానం తీవ్ర కుదుపులకు లోనవుతోందని, 220 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని విన్నవించుకుంటూ, కొద్ది దూరం తమ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతించమని వేడుకున్నాడు.
కానీ, పాకిస్తాన్ లాహోర్ ATC అనుమతి నిరాకరించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలకు తమ గగనతలం మూసివేయబడిందని, అనుమతి ఇవ్వలేమని తెగేసి చెప్పింది. విమానం అత్యవసర స్థితిలో ఉందని శ్రీనగర్ ATCకి కూడా పైలట్ సమాచారం ఇచ్చారని, ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. అయినా సరే, పాకిస్తాన్ కంట్రోల్ వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా అనుమతి నిరాకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి, తీవ్ర కుదుపుల మధ్యే ఇండిగో విమానం శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనితో 220 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
