Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి రామ్మోహన్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేత గుడివాడ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో సంక్షోభంపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ రాజకీయాలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Dec 2025 12:43 AM IST
కేంద్రమంత్రి రామ్మోహన్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేత గుడివాడ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
X

దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో సంక్షోభంపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ రాజకీయాలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశం పరువు తీసిన ఇండిగో తప్పులను ఎత్తిచూపకుండా, రాజకీయాల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ‘దేశంలో తెలుగువారి పరువును ప్రపంచంలో మన దేశం పరువును కేంద్ర మంత్రి తీశారంటూ మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన విమర్శలను తప్పుబడుతున్నారు.

కేంద్ర విమానయాన మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాలను అమలులోకి తెచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల పైలట్లకు తగినంత విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట విధుల్లో ఉండే పరిమితులను కఠిన తరం చేయడం వల్ల ఇండిగో పెద్ద ఎత్తున కొత్త నియామకాలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే కొత్త నిబంధనలకు సిద్ధపడటానికి విమానయాన సంస్థలకు దాదాపు రెండేళ్ల గడువు ఇచ్చినా, ఇండిగో తగినంత సంఖ్యలో కొత్త పైలట్లను నియమించుకోవడం, షెడ్యూళ్లను సర్దుబాటు చేయడంలో విఫలమైందని అంటున్నారు.

ఇక దేశంలో మొత్తం విమానయానం రెండు సంస్థల గుత్తాధిపత్యం కిందకు వెళ్లిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. మూడింట రెండొంతుల వాటా కేవలం ఒక్క సంస్థ చేతిలోనే ఉండటం కూడా ప్రస్తుత ఇబ్బందికి దారి తీసిందని అంటున్నారు. 2014లో దేశ పౌర విమానయాన రంగంలో నాలుగు సంస్థలు ప్రధాన వాటాను పంచుకోగా, మరో మూడు సంస్థలు భాగస్వామ్యం అయ్యాయని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండిగో చేతిలోనే 63 శాతం వాటా ఉండటం, ఆ సంస్థ విమానాలు రద్దు చేయడంతో విమానయానం గందరగోళంలో పడిందని చెబుతున్నారు.

కానీ, ఏపీలో ఉన్న రాజకీయాల కారణంగా కేంద్ర మంత్రిని తప్పుబట్టడంపైనే నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా, ఇండిగో తప్పిదాలను ఎత్తిచూపాలని అంటున్నారు. ఇదే సమయంలో ఇండిగో సంక్షోభానికి బాధ్యులు ఎవరో గుర్తించి వారంలో చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి, దేశం కోసం నిలబడాలని నెటిజన్లు కోరుతుండటం విశేషంగా చెబుతున్నారు.