గోవా నుంచి బయలు దేరిన విమానంలో గందరగోళం.. ఏమి జరిగిందంటే..!
ఇటీవల వరుసగా జరుగుతున్న విమానాల్లోని ఇసాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనల్లో మరొకటి వచ్చి చేరింది.
By: Tupaki Desk | 22 July 2025 1:21 PM ISTఇటీవల వరుసగా జరుగుతున్న విమానాల్లోని ఇసాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనల్లో మరొకటి వచ్చి చేరింది. ఇందులో భాగంగా... ల్యాండింగ్ గేర్ కు సంబంధించిన సాంకేతిక సమస్య కారణంగా సోమవారం సాయంత్రం 140 మంది ప్రయాణికులతో గోవా నుండి బయలుదేరిన ఇండిగో విమానం ఇండోర్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు.
అవును... గోవా నుండి 140 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం సాయంత్రం ఇండోర్ లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబడిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన విమానాశ్రయ డైరెక్టర్ విపింకాంత్ సేథ్... గోవా నుండి వచ్చిన ఇండిగో విమానం (6ఈ 813) కి అండర్ క్యారేజ్ హెచ్చరిక వచ్చిందని.. దాని ల్యాండింగ్ గేర్ లో సమస్య ఉండవచ్చని సూచిస్తుందని తెలిపారు. ఈ సమయంలో... ముందుజాగ్రత్త చర్యగా విమానం ల్యాండింగ్ కు ముందు దాదాపు 25 నిమిషాల పాటు గాల్లోనే ఉండిపోయిందని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మరో అధికారి... 140 మంది ప్రయాణికులతో ఉన్న విమానంలో అండర్ క్యారేజ్ హెచ్చరిక గురించి సమాచారం అందిందని.. దీనితో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించామని చెప్పారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలను నియమించామని చెప్పారు.
ఇదే క్రమంలో... విమానం ఇండోర్ లో సురక్షితంగా ల్యాండ్ అయిందని.. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు తప్పనిసరి విధానాల ప్రకారం అవసరమైన తనిఖీలు చేయబడతాయని తెలిపారు. తదుపరి విమానాలపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇండిగో ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు!
కాగా... సోమవారం మధ్యాహ్నం గోవా నుంచి 3:03 గంటలకు 140 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ 813.. సాయంత్రం 4:50 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. కాస్త ఆలస్యంగా 5:15 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది!
