కొత్త ఎయిర్‌లైన్స్.. గతంలో చేతులు కాల్చుకున్న మాల్యా, రాంచరణ్
వందల విమానాల రద్దు.. వేలాదిమంది ప్రయాణికుల కష్టాలు.. ఇండిగో కౌంటర్లపై మహిళల దాడి… బ్యాగుల కుప్పలుగా విమానాశ్రయాలు... కోట్ల రూపాయల ఛార్జీలు దండగ..
By: Tupaki Desk | 25 Dec 2025 9:21 AM ISTవందల విమానాల రద్దు.. వేలాదిమంది ప్రయాణికుల కష్టాలు.. ఇండిగో కౌంటర్లపై మహిళల దాడి… బ్యాగుల కుప్పలుగా విమానాశ్రయాలు... కోట్ల రూపాయల ఛార్జీలు దండగ.. అంతా గగ్గోలు గగ్గోలు… ఇదీ ఈ నెల మొదటి వారంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో దేశంలో కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్ కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటి పేర్లు అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్, శంఖ్ ఎయిర్. వీటికి నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) సైతం జారీ చేసింది. శంఖ్ వచ్చే ఏడాది మొదట్లోనే కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ మూడు సంస్థల విమానాలు అందుబాటులోకి వస్తే ఇండిగో సంక్షోభం వంటి పరిస్థితి తలెత్తదు. మార్కెట్లో పోటీ పెరిగి.. గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది. వాస్తవానికి ఇండిగో సమస్య.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) కారణంగా వచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనలతో పైలట్ల కొరత ఏర్పడింది. కేవలం వారం రోజుల్లో 5 వేలకు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతోనే విమానాశ్రయాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లుగా మారాయి. ఇంత పెద్ద దేశంలో అందులోనూ దేశీయ విమాన ప్రయాణాలు భారీగా పెరిగిన సమయంలో ఒకటీ, రెండు సంస్థలపై ఆధారపడడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో కళ్లు తెరిచిన కేంద్రం.. కొత్త సంస్థలను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది.
మూడు సంస్థలు.. ఒకటి హైదరాబాద్..
శంఖ్ ఎయిర్ యూనీ రాజధాని లక్నో కేంద్రంగా పనిచేయనుంది. వారణాసి, గోరఖ్‌పూర్, అయోధ్య, ఇండోర్ నగరాలకు బోయింగ్ విమానాలు నడపనుంది. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో టేకాఫ్ కానుంది. ఇక అల్ హింద్ ఎయిర్ కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ది. కొచ్చి కేంద్రం కేరళతో పాటు, బెంగళూరు, చెన్నైలకు సర్వీసులు నడపనుంది. మూడోది ఫ్లై ఎక్స్ ప్రెస్ మరింత ప్రత్యేకం ఏమంటే... ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. కార్గొ, కొరియర్ నుంచి ఈ సంస్థ ప్రయాణికుల రంగంలోకి అడుగుపెట్టనుంది.
ఆ రెండు సంస్థలదే ఆధిపత్యం..
భారత విమానయాన రంంలో ఇండిగో వాటా 65 శాతం. మరో 25 శాతం ఎయిర్ ఇండియాది. వీటిదే 90 శాతంపైగా వాటా ఉంది. ఇప్పుడు మూడు కొత్త సంస్థలు వస్తే గుత్తాధిపత్యం తగ్గుతుంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు పెరుగుతాయి. టికెట్ ధరలు తగ్గుతాయి. ఇక డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు వచ్చాక కొత్త సంస్థలు సేవలు మొదలుపెడతాయి.
రాంచరణ్, మాల్యా అనుభవాలు...
భారత్ లో ఇద్దరు ప్రముఖులు ప్రయివేటు ఎయిర్ లైన్స్ ప్రారంభించి చేతులు కాల్చుకున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ను స్థాపించారు. ప్రీమియం సర్వీసులకు గ్లామర్ జోడించారు. కానీ, భారీ రుణభారంతో కుప్పకూలింది. ఆపరేషనల్ సమస్యలు, ఆర్థికంగా నిర్వహణ లోపాలతో 2012లో మూతపడింది.
భారత ఏవియేషన్ చరిత్రలో ఇదొక విఫల ప్రయోగంగా నిలిచింది.
-ఇక ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ సైతం ట్రూ జెట్ పేరిట ఎయిర్ లైన్స్ ను స్థాపించారు. తక్కువ చార్జీలతో హైదరాబాద్ కేంద్రంగా దీని కార్యకలాపాలు 2015లో ప్రారంభమయ్యాయి. 2022లో ఆర్థిక సమస్యలతో సర్వీసులు బంద్ చేసింది. ఈ ఏడాది పునఃప్రారంభిస్తారని కథనాలు వచ్చినా అవేవీ ఆచరణలోకి రాలేదు.
