Begin typing your search above and press return to search.

సీజను సీజను... 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5 లక్షల కోట్లు!

ఇందులో భాగంగా జనవరి 15 - జూలై 15 మధ్య సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు "సీఏఐటీ" నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:14 AM GMT
సీజను సీజను... 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5 లక్షల కోట్లు!
X

భారతదేశంలో వివాహ వ్యవస్థ అత్యంత బలమైనది అని చెబుతారు! ఇక ఇక్కడ వివాహ వేడుక అంటే లైఫ్ లో మరిచిపోలేని పెద్ద ఈవెంట్ లా ప్లాన్ చేసుకుంటారు. ఎవరి స్థాయిలో వారు ఉన్నంతలో ఘనంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ సమయంలో జరగబోయే పెళ్లిల్లు, వాటికి అయ్యే ఖర్చులకు సంబంధించిన అంచనాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.

అవును... జనవరి 15 నుంచి జులై 15 వరకు దేశం మొత్తం మీద జరిగే పెళ్లిళ్లు, వాటికి అయ్యే ఖర్చులు వంటి విషయాలను "కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్" వెల్లడించింది. ఇందులో భాగంగా జనవరి 15 - జూలై 15 మధ్య సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు "సీఏఐటీ" నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. దీని ద్వారా దేశంలో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇలా ఆరు నెలల కాలంలోనూ వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవలను అందించడం ద్వారా సుమారు రూ. 5.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని.. ఈ సమయంలో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారీగా నగదు రానుందని సీఏఐటీ వెల్లడించింది. ఈ పెళ్లిళ్ల సీజన్‌ లో దేశరాజధాని ఢిల్లీలోనే సుమారు 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని.. దీని వల్ల దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌ వాల్ తెలిపారు.

ఈ క్రమంలో... గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌ లో దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల వివాహాలు జరగ్గా.. వాటివల్ల సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌ లో 5 లక్షల పెళ్లిళ్లలో ఒక వివాహానికి అయ్యే ఖర్చు కనీసం రూ.3 లక్షలు కాగా... దాదాపు 10 లక్షల వివాహాలలో ఒక్కో పెళ్లికి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇదే సమయంలో... మరో 10 లక్షల వివాహాల అంచనా వ్యయం ఒక్కో వివాహానికి రూ. 10 లక్షలుగా అంచనా వేస్తున్నారు.

ఇక సుమారు 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.15 లక్షలు అవుతుందని చెబుతుండగా.. సుమారు 6 లక్షల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 60 వేల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని.. 40 వేల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ. కోటికి పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు! వీటన్నింటికీ కలిపి సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి పెళ్లిళ్ల సీజన్ కు ముందు ఇంటి రిపేర్లకు సంబంధించిన వ్యాపారంతోపాటు పెయింటింగ్‌ వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ప్రవీణ్‌ ఖండేల్‌ వాల్‌ తెలిపారు. ఇది కాకుండా.. ఆభరణాలు, వస్త్రాలు, పాదరక్షలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా సామాగ్రి, కిరాణా, వివిధ బహుమతుల వస్తువులు మొదలైనవి డిమాండ్‌ లో ఉన్నాయని.. ఫలితంగా ఆ సీజన్‌ లో భారీ వ్యాపారాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.