Begin typing your search above and press return to search.

ఇదీ భారత్‌ దెబ్బ అంటే.. మాల్దీవులకు బండ పడిందిగా!

దీనివల్ల మనదేశంలో పర్యాటక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 5:30 PM GMT
ఇదీ భారత్‌ దెబ్బ అంటే.. మాల్దీవులకు బండ పడిందిగా!
X

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం, అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. లక్షద్వీప్‌ లో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయని.. భారతీయులు తమ పర్యాటక గమ్యస్థానంగా లక్షద్వీప్‌ ను ఎంపిక చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల మనదేశంలో పర్యాటక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు.

మరోవైపు భారత ప్రధాని మోదీ లక్షద్వీప్‌ ను పర్యటనను ఎగతాళి చేస్తూ, భారత పర్యాటక ప్రాంతాలను చిన్నబుచ్చుతూ మాల్దీవుల ఎంపీలు, మంత్రులు నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బాయ్‌ కాట్‌ మాల్దీవులు’ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది భారత సెలబ్రిటీలు, వ్యక్తులు తాము మాల్దీవులకు వెళ్లబోమని.. ఇప్పటికే చేసుకున్న బుకింగ్స్‌ లను రద్దు చేసుకుంటున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాల్దీవుల పర్యాటక రంగానికి భారీ బండ పడింది. ఆ దేశానికి ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు వెళ్లేది భారతీయులే. భారత్‌ తో దౌత్య వివాదాలు పెట్టుకుంటున్న ఆ దేశానికి వెళ్లడం తగ్గించేయడంతో మాల్దీవుల టూరిజానికి భారీ బండ పడింది.

ఇటీవల కాలం వరకు మాల్దీవులను సందర్శిస్తున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆరో స్థానంలో నిలిచింది. చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్‌ ను కించపరిచాక మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది.

మాల్దీవులు ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి 2,09,198 మంది మాల్దీవులను సందర్శించారు. తద్వారా 11 శాతం వాటాతో మాల్దీవుల పర్యాటక రంగంలో భారత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో ఉండగా నాలుగో స్థానంలో బ్రిటన్‌ ఉంది.

అయితే ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల నేతలు నోరుపారేసుకోవడం, ఆ దేశ కొత్త అధ్యక్షుడు చైనాతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ భారత్‌ ను చిన్నచూపు చూస్తుండటంతో భారత పర్యాటకులు తగ్గిపోయారు.

జనవరి ప్రారంభంలో లక్షద్వీప్‌ లో ప్రధాని మోదీ పర్యటన తర్వాత.. మూడు వారాల్లో (జనవరి 21 నాటికి) అగ్రస్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఐదో స్థానానికి దిగొచ్చింది. 28 వేల లోపు పర్యాటకులతో (6.3 శాతం) మార్చి 3 నాటికి భారత్‌ ఆరో స్థానానికి పడిపోయింది.

భారత పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో ఇప్పుడు మాల్దీవుల పర్యాటక మార్కెట్‌ లో 12 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రష్యా(9.8 శాతం), ఇటలీ (9.6 శాతం), యూకే (9.0శాతం), జర్మనీ (6.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ తో దౌత్యపర వివాదం మాల్దీవుల ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తోంది. ఆ దేశానికి పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో భారతీయుల వాటానే అధికం కావడం ఇందుకు కారణం. ఈ వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33 శాతానికి తగ్గిందని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదించింది. దీంతో ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

మాల్దీవులు పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది మార్చి 4 నాటికి 41,054 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు.

ఈ ఏడాది మార్చి 2 నాటికి కేవలం 27,224 మంది భారతీయులే మాల్దీవులకు వెళ్లారు. అంటే గతేడాది కంటే 13,830 తక్కువ.