Begin typing your search above and press return to search.

తెలంగాణాలో హంగ్ ... ఇండియా టుడే సర్వే!

ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 54 సీట్లు వస్తే, బీయారెస్ కి 49 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వస్తాయని తేలింది. ఇతరులకు ఎనిమిది సీట్లు అని పేర్కొంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:19 PM GMT
తెలంగాణాలో  హంగ్ ... ఇండియా టుడే సర్వే!
X

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదా అంటే ఇప్పటిదాకా వస్తున్న సర్వేలు అన్నీ కూడా అదే చెబుతున్నాయి. తెలంగాణాలో హంగ్ రావచ్చు అన్నట్లుగానే సర్వే ఫలితాలను రిలీజ్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా చూస్తే ఇండియా టుడే ఒపీనియన్ పోల్ తో ఒక సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 54 సీట్లు వస్తే, బీయారెస్ కి 49 సీట్లు, బీజేపీకి 8 సీట్లు వస్తాయని తేలింది. ఇతరులకు ఎనిమిది సీట్లు అని పేర్కొంది.

మరి ఈ సర్వే చూస్తే కనుక ఏ ఒక్క పార్టీకి సింపుల్ మెజారిటీ వచ్చే సూచనలు అయితే కనిపించడంలేదు అని చెప్పాలి. తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. సింపుల్ మెజారిటీ అంటే సగానికంటే ఒక్క సీటు అదనంగా రావాలి. అలా చూస్తే అరవై సీట్లు వచ్చిన పార్టీదే అధికారం.

మరి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లే వస్తాయని ఉంది కానీ 54 దగ్గరే ఆ ఫిగర్ ఆగిపోతోంది. ఈ హోరాహోరీ పోరులో బీయారెస్ కూడా దగ్గరలోనే అంటే 49 సీట్లు వస్తాయని పేర్కొంది. అంటే కాంగ్రెస్ బీయారెస్ పార్టీల మధ్య కేవలం మూడు సీట్లు మాత్రమే తేడా ఉంది. బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని సర్వే అంటోంది.

గత ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చిన బీజేపీకి ఇపుడు నాలుగు రెట్లు సీట్లు పెరుగుతాయని అనుకోవాలన్న మాట. ఇక ఇతరులకు ఎనిమిది సీట్లు ఇచ్చారు. ఆ ఇతరులలో ఏడు సీట్లకు పైగా మజ్లీస్ గెలుచుకుంటుంది అని చెప్పవచ్చు అంటున్నారు.

ఇలా కనుక లెక్క తీస్తే ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితులలో ఏ రెండు పార్టీలు కలసినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా కనిపించడంలేదు. బేజేపీ బీయారెస్ కలిసినా కూడా 57 సీట్లకే పరిమితం అవుతారు. ఇక ఇతరులలో మజ్లీస్ కి ఏడు సీట్లు వస్తాయనుకుంటే బీయారెస్ మజ్లీస్ కలసినా కూడా మెజారిటీ రాదు అంటున్నారు. అదే మజ్లీస్ కాంగ్రెస్ తో కలిస్తే మాత్రం సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అని అంటున్నారు.

అయితే ఇది ఇంకా స్టార్టింగ్ లో తీసుకున్న ఒపీనియన్ పోల్. ఇది మరింతగా ముందుకు సాగుతుంది. బీయారెస్ అభ్యర్ధులు అయితే డిక్లేర్ అయిన తరువాత వచ్చిన సర్వే కాబట్టి మార్పుచేర్పులు అక్కడ పెద్దగా ఉండే చాన్స్ లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ టోటల్ అభ్యర్ధులను ప్రకటించి జనంలోకి వెళ్లిన తరువాత ప్రచారం హోరు మరింతగా పెరిగిన తరువాత కచ్చితంగా మార్పు వస్తుంది అని అంటున్నారు.

అలాగే బీజేపీ టోటల్ లిస్ట్ బయటకు రావాల్సి ఉంది. ఏది ఏమైనా నవంబర్ మొదటి రెండవ వారాలలో వచ్చే ఒపీనియన్ పోల్ మాత్రం పూర్తి స్థాయిలో నిజమయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పటికైతే మొగ్గు కాంగ్రెస్ కే ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. అదే టెంపో కనుక కొనసాగితే సింపుల్ మెజారిటీ కాంగ్రెస్ సాధించడం కష్టం కాబోదు అని అంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ అన్నట్లుగా సునామీ కనుక తెలంగాణాలో ఉంటే కాంగ్రెస్ కి అద్భుతం మెజారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.