Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్: 'ఇండియా'కూటమి రియాక్షన్ వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో శనివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై కేంద్రంలోని విపక్ష కూటమి "ఇండియా" స్పందించింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారుతుంది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 12:13 PM GMT
బాబు అరెస్ట్: ఇండియాకూటమి రియాక్షన్  వైరల్!
X

రాజకీయాల్లో శాస్వత శత్రువులూ, శాస్వత మిత్రులు ఉండరనేది తెలిసిన విషయమే! ఇక చంద్రబాబుకు అయితే ఎవరూ శాస్వతం కాదని కొంతమంది కామెంట్ చేస్తుంటారు! ఆ సంగతి అలా ఉంటే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో శనివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై కేంద్రంలోని విపక్ష కూటమి "ఇండియా" స్పందించింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారుతుంది.

అవును... ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత అయిన చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో అనేక పార్టీల నుంచి స్పందనలు, ఖండనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన ఒక వర్గం నుంచి ఖండన వచ్చింది. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌ తో సహా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రతిపక్ష పార్టీల సమ్మేళనం అయిన ఇండియా కూటమి ఈ విషయంపై ట్వీట్ చేశింది.

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన ఇండియా కూటమి... "ప్రజాస్వామ్యం వెనకడుగు వేస్తోంది. మేం చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటాం. నియంతృత్వం వాస్తవం అయినప్పుడు, విప్లవం ఒక హక్కు అవుతుంది" అని తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో స్పందించింది. ఇప్పుడు రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

కారణం... కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన విపక్షాల సమూహం "ఇండియా" కూటమిలో టీడీపీ భాగస్వామి కాదు! ఈమధ్య కాలంలో బెంగళూరులో జరిగిన దేశవ్యాప్తంగా ఉన్న యాంటీ బీజేపీ విపక్ష పార్టీల మీటింగ్ కు టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పేరు చెబితే 2018 ఎన్నికల దెబ్బ గుర్తుకు తెచ్చుకుంటున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో "ఇండియా" కూటమి చంద్రబాబు అరెస్టును ఖండించడం కచ్చితంగా రాజకీయంగా ఆసక్తికలిగించే అంశమే అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో "ఇండియా" కూటమికి రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించింది. అయితే జాతీయ నాయకత్వం నుంచి స్పందన రానప్పటికీ... ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరి ఈమేరకు ఒక ట్వీట్ చేశారు.

మరోపక్క బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ చంద్రబాబు అరెస్టును వ్యక్తిగతంగా తీవ్రంగా వ్యతిరేకించారు! "చట్టం ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, సహేతుకమైన కారణం ఉండాలి.. కొన్ని విధానాలను అనుసరించాలి. లేకుంటే కక్ష సాధింపు చర్యో లేక దిక్కుమాలిన మనస్తత్వాన్ని సంతృప్తి పరచడమో అనుకోవాలి" అంటూ ట్వీట్ చేశాడు.

ఇదే క్రమంలో కమ్యునిస్టు పార్టీలు, జనసేన పార్టీల నుంచి కూడా బాబు కు మద్దతుగా కామెంట్లు వెలువడ్డాయి. దీంతో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు, కేడర్ నుంచి ఎంతమేరకు పొలిటికల్ రియాక్షన్ వచ్చిందనే సంగతి కాసేపు పక్కనపెడితే... మిగిలిన పార్టీల నుంచి మాత్రం ఊహించని స్థాయిలో రియాక్షన్ వచ్చిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.