Begin typing your search above and press return to search.

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంకు భారత్‌ షాక్‌!

అలాగే ఈ ఇంటితోపాటు మరికొన్ని ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jan 2024 7:46 AM GMT
మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంకు భారత్‌ షాక్‌!
X

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, ముంబై బాంబుపేలుళ్ల సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహీంకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. అతడి చిన్ననాటి ఇంటిని వేలం వేయనుంది. చిన్నప్పుడు దావూద్‌ ఇబ్రహీం ఈ ఇంటిలోనే నివసించాడు. అలాగే ఈ ఇంటితోపాటు మరికొన్ని ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. వీటిని ఇప్పుడు వేలం వేయడానికి నిర్ణయించారు.

మహారాష్ట్రలోని రత్నగిరి పరిధిలో ఉన్న ముంబాకే గ్రామంలో జనవరి 5న ఈ వేలం నిర్వహిస్తారు. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. కాగా ఇప్పటికే గత 9 ఏళ్లలో దావూద్‌ కుటుంబానికి చెందిన రెస్టారెంట్, ఫ్లాట్స్, గెస్ట్‌ హౌస్‌ సహా 11 ఆస్తుల్ని వేలం వేసి సుమారు రూ.12 కోట్లు సమీకరించింది.

దావూద్‌ ఇబ్రహీం ను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించడంతో 1980 దశకంలోనే పాకిస్థాన్‌ కు పరారయ్యాడు. 1993లో ముంబైలో బాంబుపేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించాడు. దీంతో అమెరికాతోపాటు, ఐక్యరాజ్యసమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. ఇప్పటికీ అతడు పాకిస్థాన్‌ లోనే ఉన్నాడని భారత దర్యాప్తు సంస్థలు విశ్వసిస్తున్నాయి. పాకిస్థాన్‌ కూడా ఒకసారి ఈ విషయాన్ని అంగీకరించింది.

కాగా ఇటీవల దావూద్‌ చనిపోయాడనే వార్తలు వినిపించాయి. విషప్రయోగం జరిగిందని, దీంతో కరాచీలో ఓ ఆసుపత్రిలో చేరాడని మీడియా పేర్కొంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకపోవడం గమనార్హం. 70 ఏళ్లకు వయసుకు పైబడిన అతడు షుగర్‌ తో బాధపడుతున్నాడని, ఇంకా ఇతర జబ్బులు కూడా ఉన్నాయని సమాచారం.

గతంలో దావూద్‌ చనిపోయాడనే వార్తలు పలుమార్లు వినిపించాయి. రక్తంలో ఇన్ఫెక్షన్‌ తో అతడు బాధపడుతున్నాడని, దాంతో ఆయన కాలు తీసేయాల్సి వచ్చిందని 2016లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్త తప్పని తేలింది. 2017లో గుండెపోటుతో మృతి చెందాడని వార్తలు వచ్చాయి. ఇది కూడా తప్పని తేలింది. ఇక 2020లో దావూద్‌ కరోనా వైరస్‌ బారినపడ్డాడని.. పరిస్థితి విషమించి మరణించాడన్నారు. తర్వాత అవి కూడా తప్పుడు వార్తలేనని తేలింది.

ఇప్పుడు తాజాగా దావూద్‌ చిన్ననాడు నివసించిన ఇంటిని, అతడి మరికొన్ని ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేలం వేస్తుండటంతో అతడి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.