Begin typing your search above and press return to search.

భారత్ లో 3 వివాహ చట్టాలు... ఏమిటీ ''ప్రత్యేక వివాహ చట్టం''!

ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:10 AM GMT
భారత్ లో 3 వివాహ చట్టాలు... ఏమిటీ ప్రత్యేక వివాహ చట్టం!
X

ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎల్‌.జీ.బీ.టీ.క్యూ., పిటిషనర్లు, కార్యకర్తలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తుండగా... మరికొందరు తీర్పులోని సానుకూల అంశాలను ప్రస్తావిస్తున్నారు.

ఇందులో భాగంగా... భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేకపోవడంపై ఎల్‌.జీ.బీ.టీ.క్యూ. కార్యకర్త డాక్టర్‌ మాలీ విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా సుప్రీంకోర్టు పార్లమెంటును కోరిందని, అందుకోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఇలా... స్వలింగ సంపర్కుల వివాహాలకు "ప్రత్యేక వివాహాల చట్టం" కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా... కోర్టులు చట్టాలను రూపొందించబోవని, వాటికి భాష్యం చెప్పి అమలయ్యేలా చేస్తాయని వివరించింది.

వాస్తవానికి 2018 సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది! ఇందులో భాగంగా... స్వలింగ సంపర్కం నేరం కాదని తెలిపింది. దీంతో... తమ వివాహాలకు గుర్తింపును స్వలింగ జంటలు కోరడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సుమారు 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు, స్కుల్లో పిల్లల పేరెంట్స్ గా పేర్లు నమోదుకు అవకాశం మొదలైన వంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు.

ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్‌ 18 నుంచి పది రోజులపాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ క్రమంలో తాజాగా వీరి వివాహాలకు "ప్రత్యేక వివాహాల చట్టం" కింద చట్టబద్ధత కల్పించేందుకు ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది.

ఏమిటీ ప్రత్యేక వివాహ చట్టం?:

భారత సమాజం దృష్టిలో వివాహం అంటే.. ఇద్దరు వ్యక్తులు ఏకమవటమేగాదు, రెండు కుటుంబాలను దగ్గర చేయడం! అయితే ఈ క్రమంలో కులాలు, మతాలు, ఆర్థిక పరిస్థితులు మొదలైన ఎన్నో విషయాలు ఈ పెళిళ్లకు అడ్డంకులుగా మారుతుంటాయి. ఈ క్రమంలో... ఆ అడ్డంకులను అధిగమించి, అర్హులైనవారు కులమతాలకు అతీతంగా వివాహబంధంలో ఏకమయ్యేందుకు వీలు కల్పించేదే "ప్రత్యేక వివాహ చట్టం 1954".

భారత్‌ లో ప్రస్తుతం వివాహాలు మూడు రకాలుగా నమోదవుతున్నాయి. అవి.. హిందూ వివాహ చట్టం 1955, ముస్లిం వివాహ చట్టం 1954, ప్రత్యేక వివాహ చట్టం 1954. వీటిలో మొదటి రెండింటిలో కులాంతర, మతాంతర వివాహాలకు అవకాశం లేదు. అంటే... హిందూ, ముస్లిం వివాహ చట్టాల ప్రకారం వధూవరులు వేర్వేరు మతాలవారైతే పెళ్లికి ముందే భాగస్వాములు ఎవరో ఒకరి మతంలోకి మారాల్సి ఉంటుంది.

కానీ... ప్రత్యేక వివాహ చట్టంలో ఈ సమస్య లేదు. మతం, కులం మారకుండానే పెళ్లి చేసుకోవచ్చు. బ్రిటిష్‌ కాలంలోనే ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని స్వాతంత్య్రం వచ్చాక కొన్ని మార్పులు చేర్పులతో 1954 అక్టోబరు 9న పార్లమెంటులో ఆమోదించారు. ఇది మతాలు, కులాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తిస్తుంది. కాకపోతే... ఈ చట్టంనుంచి ఒక్క జమ్మూకశ్మీర్‌ కు మాత్రం మినహాయింపునిచ్చారు.

దీంతో... ఈ "ప్రత్యేక వివాహ చట్టం" ప్రకారం కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించినట్లే స్వలింగ వివాహాలనూ ఆమోదించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. స్త్రీ - స్త్రీ, పురుషుడు - పురుషుడు వివాహ బంధంలో ఉండాలనుకుంటే వారి వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ఈ పిటిషన్ లలో కోరారు. దీంతో ఈ పిటిషన్లపై ఏకబిగిన సాగిన విచారణల అనంతరం సూప్రీం తీర్పు వెలువడించింది.