Begin typing your search above and press return to search.

అరుదైన సంఘటన.. సుప్రీంకోర్టులో సైగలతోనే వాదనలు!

వైకల్యం తమ ఎదుగుదలకు అడ్డుకాదని, తమ లక్ష్యాలు చేరుకోవడానికి ఆటంకం కాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Sep 2023 8:22 AM GMT
అరుదైన సంఘటన.. సుప్రీంకోర్టులో సైగలతోనే వాదనలు!
X

వైకల్యం తమ ఎదుగుదలకు అడ్డుకాదని, తమ లక్ష్యాలు చేరుకోవడానికి ఆటంకం కాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించిన సంగతి తెలిసిందే. రకరకాల రంగాల్లో దివ్యాంగులు రాణించారు. ఈ క్రమంలోనే వినికిడి లోపం ఉన్నప్పటికీ తాను అనుకున్న న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ తాజాగా సుప్రీంలో వాదనలు వినిపించారు కేరళకు చెందిన మహిళ న్యాయవాది సారా సన్ని.

అవును.. దివ్యాంగురాలైన న్యాయవాది ఓ కేసులో సైగలతో వాదనలు వినిపించిన అరుదైన ఘట్టం ఇటీవల సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఈ నెల 22న వర్చువల్‌ విధానంలో కేసు విచారణను ఓ వ్యక్తి సైగలతో వివరించడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. వినికిడి లోపం కలిగిన ఓ మహిళా న్యాయవాది ఇలా సైగలతో వాదనలు వినిపించారు.

వివరాళ్లోకి వెళ్తే... కేరళకు చెందిన సారా సన్నీకి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. ఆ లోపం ఆమె న్యాయవిద్యను అభ్యసించడానికి అడ్డు కాలేదు. దీంతో ఎంతో పట్టుదలతో న్యాయవిద్యను పూర్తిచేసిన సారా సన్నీ... ప్రముఖ న్యాయవాది సంచితా ఐన్‌ వద్ద జూనియర్‌ గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.

ఇందులో భాగంగా... శుక్రవారం ఉదయం ఓ కేసు విచారణలో భాగంగా ఆమెతో కలిసి కోర్టుకు హాజరయ్యారు సారా సన్నీ! ఈ విచారణలో వాదోపవాదనలు సారా సన్నీకి అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్‌ లో చెప్పేందుకు "ఇండియన్ సైన్ లాంగ్వేజ్" వ్యాఖ్యాత సౌరవ్‌ రాయ్‌ చౌధురిని సంచితా ఐన్ నియమించారు. ఈక్రమంలో విచారణ మొదలైంది.

సౌరవ్‌ రాయ్‌ చౌధురి కూడా స్క్రీన్‌ పై కనిపించడంపై సుప్రీంకోర్టు మోడరేటర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈలా విచారణను సౌరవ్‌ రాయ్ వివరిస్తుండగా.. దానిపై అవతలివైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో... వ్యాఖ్యాతను అనుమతించాల్సిందిగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ను సంచిత ఐన్ అభ్యర్థించారు. దానికి ప్రాధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారు.

దీంతో... ఈ కేసుతో సహా ఇతర కేసుల విచారణను సైగల ద్వారా రాయ్‌ వివరించారు. అనంతరం తనకు ఇలాంటి ప్రత్యేక అవకాశాన్ని కల్పించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూ డ్ కు సారా సన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో సహకరించిన ఇతర న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో భవిష్యత్తులోనూ వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని సారా ధీమా వ్యక్తంచేశారు.