Begin typing your search above and press return to search.

భారతీయులే లక్ష్యంగా కెనడాలో మరో దుశ్చర్య!

ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత అధికారులే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:36 AM GMT
భారతీయులే లక్ష్యంగా కెనడాలో మరో దుశ్చర్య!
X

భారత వ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు కొన్నేళ్లుగా కెనడా ఊతమిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యేక ఖలిస్తాన్‌ ఏర్పాటును కోరుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంలా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత అధికారులే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది భారత్, కెనడాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభానికి దారితీసింది.

హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారంలో భారత్, కెనడా ఇరు దేశాలు దౌత్య సిబ్బందిని బహిష్కరించుకోవడం, తగ్గించుకోవడం చేశాయి. మరోవైపు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారంలో కెనడా చేసిన ఆరోపణలను భారత్‌ తోసిపుచ్చింది. ఆ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

కాగా కెనడాలో గత ఏడాది కాలంగా భారత దౌత్యాధికారులకు వరుస బెదిరింపులు వచ్చాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ బాంబుపేల్చారు. ఈ బెదిరింపులకు సంబంధించి కెనడా వ్యవస్థల నుంచి భారత్‌ కు ఎలాంటి సహకారం లభించలేదని తెలిపారు. అందువల్లే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. కెనడాలోని పరిస్థితులను వివరిస్తూ జైశంకర్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్, లండన్‌ లోని హైకమిషన్‌ పై దాడులు చేసిన వారితో పాటు కెనడాలో భారత దౌత్యాధికారులను బెదిరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని జైశంకర్‌ డిమాండ్‌ చేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదులు భారత దౌత్య కార్యాలయాలపై ‘స్మోక్‌ బాంబు’లతో దాడులు చేశారని ఆరోపించారు. వారికి కెనడా అంత స్వేచ్ఛ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్‌ స్వేచ్ఛ విస్తరించడం మంచిది కాదని కెనడాకు హితవు పలికారు.

యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలోనూ కెనడా తరహాలోనే దాడులు జరిగాయని జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు అక్కడ తగినంత భద్రత లభించలేదన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయని వెల్లడించారు. ఇప్పుడు ఆ దేశాల్లో భారతీయులపై/భారతీయ సంస్థలపై ఎలాంటి దాడులు జరిగినా చాలా బలమైన ప్రతిస్పందన వస్తుందన్నారు. ఒక దేశ రాయబార కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం తప్పుడు సంకేతాలను పంపిస్తుందని జైశంకర్‌ ఆ దేశాలకు సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.