Begin typing your search above and press return to search.

ఆ దేశంలో విదేశీ విద్యార్థులపై దాడులు... భారత ప్రభుత్వం అలర్ట్‌!

అవును... కిర్గిస్తాన్ దేశంలో రాజధాని నగరం బిషెక్‌ లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఒక మూక హింసకు పాల్పడుతోంది.

By:  Tupaki Desk   |   18 May 2024 11:30 PM GMT
ఆ దేశంలో విదేశీ విద్యార్థులపై  దాడులు... భారత ప్రభుత్వం అలర్ట్‌!
X

భారత ఉపఖండపు దేశాల్లో ఉన్న విద్యార్ధులకు విదేశాల్లో రోజు రోజుకీ ఆశించిన స్థాయిలో రక్షణ దొరకడం లేదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు సంబంధించి వార్తలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి! ఈ సమయంలో తాజాగా కిర్గిజిస్తాన్ లోనూ భారతీయ విద్యార్ధులు టార్గెట్ అయ్యారు!

అవును... కిర్గిస్తాన్ దేశంలో రాజధాని నగరం బిషెక్‌ లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఒక మూక హింసకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో చెలరేగిన చిన్న ఘర్షణ కాస్తా చినికి చినికి గాలివానగా మారి స్థానుకులు వర్సెస్ విదేశీయులు గా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై స్దానికులు తీవ్ర దాడులు చేస్తున్నారని తెలుస్తుంది.

సుమారు రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ లకు చెందిన హాస్టళ్లను ఆగంతకులు టార్గెట్ చేసుకోగా.. ఈ దాడుల్లో ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇందులో భాగంగా ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఇదే సమయంలో 24 గంటలూ అందుబాటులో ఉండే ఓ ఫోన్ నెంబర్ ను ఇచ్చింది.

ఇందులో భాగంగా... భారతీయ విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ప్రకటించిన ఎంబసీ... ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు మాత్రం బయటకు రావొద్దని సూచించింది. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని చెబుతూ... నిత్యం అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్‌ (0555710041) ను షేర్ చేసింది.

కాగా... కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌ కు చెందిన విద్యార్థుల మధ్య ఈ నెల 13న తీవ్ర ఘర్షణలు జరిగాయి! ఈ నేపథ్యంలో ఆ ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్‌ కావడంతో వ్యవహారం కాస్తా లోకల్ - నాన్ లోకల్ దాడులకు దారితీసిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మూకలు బిషెక్‌ లో భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి.