భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
ఒక్క ఆభరణాల రూపంలోనే కాక, సంపద, పెట్టుబడి, భద్రత పరంగా భావించే ఈ పసిడి ఎంత మోతాదులో భారతీయుల వద్ద ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
By: Tupaki Desk | 22 Jun 2025 9:45 AM ISTబంగారం అంటేనే భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం. ఒక్క ఆభరణాల రూపంలోనే కాక, సంపద, పెట్టుబడి, భద్రత పరంగా భావించే ఈ పసిడి ఎంత మోతాదులో భారతీయుల వద్ద ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం.. భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందట. ఇది ప్రపంచంలో ఏ ఇతర దేశానికీ లేనంత ఎక్కువ పరిమాణం. ప్రస్తుత అంతర్జాతీయ బంగారు ధరలను అనుసరించి దీని విలువ దాదాపు 2.4 ట్రిలియన్ల డాలర్లు అని ఆ సంస్థ అంచనా వేసింది.
ఈ సంఖ్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే, భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశ జీడీపీ కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. అంతేకాదు, అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా (GDP: $2.4 ట్రిలియన్), ఇటలీ (GDP: $2.3 ట్రిలియన్) జీడీపీతో సమానంగా ఉందని ఈ నివేదికలో పేర్కొనడం గమనార్హం.
భారతీయులు పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారాన్ని కొనడం సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఇది ఆర్థిక భద్రతకు మారుపేరుగా మారింది. ఊహించదగిన విధంగా, దేశంలో గోల్డ్ జ్యువెలరీ మార్కెట్ చాలా విస్తృతంగా ఉంది. ప్రపంచ బంగారు ఉత్పత్తిలో కనీసం 20% వరకు భారతదేశమే వినియోగిస్తుండటం గమనార్హం.
కరోనా సమయంలోనూ భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని తగ్గించలేదు. అసలే బంగారం ధర పెరిగిన నేపథ్యంలో కూడా, పెళ్లిళ్ల కోసం, భవిష్యత్తు కోసం ప్రజలు బంగారాన్ని కొనడం కొనసాగించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లాంటి పెట్టుబడి మార్గాలను ప్రోత్సహిస్తూ బంగారం ఫిజికల్ ఫార్మ్‌లో కొనకుండా ఆర్థిక వ్యవస్థలోకి తేగల మార్గాలను సూచిస్తోంది.
ఈ నివేదిక ఒక విషయం స్పష్టం చేసింది. భారతీయుల బంగారంపై ప్రేమ ఎంతగానో ఉంది. ఇదే దేశ ఆర్థిక సామర్థ్యానికి మారు మొక్కు కానుందనడంలో సందేహం లేదు.
