భారత్ లో ఉప్పు వినియోగం పీక్స్.. ఐసీఎంఆర్ షాకింగ్ హెచ్చరికలు!
భారతీయులు ఉప్పు తెగ తినేస్తున్నారంట! అది ఎంతలా అంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) సిఫార్సు చేసిన దానికంటే ఏకంగా 2.2 రెట్లు ఎక్కువ స్థాయిలో.
By: Tupaki Desk | 18 July 2025 10:36 AM ISTభారతీయులు ఉప్పు తెగ తినేస్తున్నారంట! అది ఎంతలా అంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) సిఫార్సు చేసిన దానికంటే ఏకంగా 2.2 రెట్లు ఎక్కువ స్థాయిలో. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా... దీనివల్ల హైపర్ టెన్షన్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల ముప్పు మరింత పెంచుతోందని తెలిపింది.
అవును... ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన దానికంటే 2.2 రెట్లు ఎక్కువ స్థాయిలో భారతీయులు ఉప్పును తీసుకుంటున్నారని.. దీనివల్ల హైపర్ టెన్షన్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఐసీఎంఆర్ - ఎన్ఐఈ) తెలిపింది.
వాస్తవానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు లేదా 2 గ్రాముల సోడియం కంటే తక్కువ తీసుకోవాలని సిఫార్సు చేయగా... ఒక భారతీయుడి రోజుకు సగటు ఉప్పు వినియోగం రోజుకు 11 గ్రాములుగా ఉందని.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు కంటే ఏకంగా 2.2 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఐసీఎంఆర్ - ఎన్ఐఈ శాస్త్రవేత్తలు... ఊరగాయలు, పప్పాడ్, నమ్కీన్, వడా పావ్, చిప్స్, నూడుల్స్, ఇతర ప్యాక్ చేసిన ఆహారాలు అధిక ఉప్పు వినియోగానికి ప్రధాన కారణాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.89 మిలియన్ల మరణాలు అధిక సోడియం తీసుకోవడం వల్ల సంభవిస్తున్నాయని హెచ్చరించారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో... పంజాబ్, తెలంగాణ లలో మూడేళ్ల వ్యవధితో కూడిన అధ్యయనాన్ని ఐసీఎంఆర్ సాయంతో ఎన్‌ఐఈ ప్రారంభించింది. ప్రస్తుతం అధ్యయనం తొలి ఏడాదిలో ఉండగా.. క్షేత్రస్థాయి సన్నద్ధత, అంచనాలపై పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో కలసి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఈ ప్రయోగాల్లో... ఉప్పు వినియోగం తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ సోడియం ఉన్న ఉప్పు (ఎల్.ఎస్.ఎస్.)పై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా... ఉప్పులోని సోడియం క్లోరైడ్ లో కొంతభాగాన్ని పొటాషియం లేదా మెగ్నీషియంతో భర్తీ చేయడం ఆశాజనకంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఇప్పటికే మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నవారికి ఎల్.ఎస్.ఎస్. సిఫార్సు చేయబడదు.
