Begin typing your search above and press return to search.

అక్కడ భారతీయులదే హవా!

ప్రపంచంలో ఏకైక సూపర్‌ పవర్‌ అమెరికాలో భారతీయులు తమ హవా కొనసాగిస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Aug 2023 2:30 PM GMT
అక్కడ భారతీయులదే హవా!
X

ప్రపంచంలో ఏకైక సూపర్‌ పవర్‌ అమెరికాలో భారతీయులు తమ హవా కొనసాగిస్తున్నారు. మొత్తం అక్కడ 34 లక్షల మంది భారతీయులు ఉన్నారని అంచనా. వీరిలో చాలా మంది చాలా ఏళ్ల క్రితమే విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లారు. అమెరికా పౌరసత్వం కూడా తీసుకుని అక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. మిగిలినవారు చదువుల్లో, ఉద్యోగాల్లో ఉన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఐటీ పరిశ్రమలు, స్టార్టప్స్, రాజకీయాలు ఇలా ప్రతి రంగంలోనూ భారతీయులు దుమ్ము లేపేస్తున్నారు. వ్యాపార, పారిశ్రామిక సంస్ధల్లోని కీలక పదవుల్లో భారతీయులే ఎక్కువమంది ఉన్నారు. దీంతో స్వతహాగానే అమెరికన్లు.. భారతీయులపై ఈర్ష్య చూపిస్తున్నారు.

ఆక్సఫర్డ్‌ అకడమిక్‌ రీసెర్చ్‌ తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్‌ లో ఉన్నారు. అలాగే అమెరికాలో స్టార్టప్స్‌ లో ఒక బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8 వేల కోట్లు) దాటిన సంస్థల్లోనూ భారతీయులదే హవా. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్‌ ఏర్పాటు చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడే కావడం గమనార్హం. స్టార్టప్స్‌ ఏర్పాటులో మన తర్వాత స్థానంలో ఇజ్రాయెల్‌ దేశస్తులు నిలిచారు.

అమెరికా మొత్తం జనాభాలో భారతీయులు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ సిలికాన్‌ వ్యాలీలోని కంపెనీల వ్యవస్ధాపకుల్లో భారతీయలు 8 శాతం ఉండటం విశేషం. అలాగే ఒక బిలియన్‌ డాలర్లు దాటిన కంపెనీల పరంగా చూస్తే భారతీయులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్‌ 31 శాతం ఉండటం విశేషం. ఈ విషయంలో చైనా, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాలన్నీ మన తర్వాతే నిలిచాయి.

అదేవిధంగా వివిధ రంగాల్లో అమెరికన్ల ఆదాయంకన్నా భారతీయ అమెరికన్ల ఆదాయం చాలా ఎక్కువని ఆక్సఫర్డ్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. అమెరికన్ల ఆదాయంతో పోలిస్తే అమెరికాలో íస్థిరపడ్డ ప్రవాస భారతీయుల ఆదాయం 31 శాతం ఎక్కువ అని తేలింది. ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల సగటు ఆదాయం ఏడాదికి 120 వేల డాలర్లుగా ఉందని సర్వే పేర్కొంది.

కాగా అమెరికా అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ ఆ దేశంలో పేదలు కూడా ఉన్నారని ఆక్సఫర్డ్‌ సర్వే వెల్లడించింది. ఆ దేశంలో 13 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని వివరించింది. మరోవైపు అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో 6 శాతం మాత్రమే పేదలు.

అమెరికన్లు తాము సంపాదించిన దానిలో అధిక భాగం ఖర్చు చేస్తుంటే భారతీయులు మాత్రం తాము సంపాదించిన దానిలో అధిక భాగం పొదుపు చేస్తున్నారని సర్వేలో తేలింది. ఈ అంశం కూడా అమెరికన్లకు, భారతీయులకు తేడాను చూపిస్తోంది. అలాగే భారతీయులు అమెరికన్లతో పోలిస్తే కుటుంబ బంధాలకు, నైతిక విలువకు పెద్దపీట వేస్తున్నారని, అమెరికాలో ఉంటున్నప్పటికీ వారు తమ భారతీయ మూలాలను మర్చిపోవడం లేదని నివేదిక వెల్లడించింది. ఇలు పలు విషయాల్లో భారతీయులు అమెరికన్లను మార్గదర్శకులుగా నిలుస్తున్నారని సర్వే పేర్కొంది.