Begin typing your search above and press return to search.

భారత టెక్కీలకు కొత్త డెస్టినేషన్... ఏ దేశమో తెలుసా?

ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తర్వాతా భారత టెక్కీలకు కెనడా కూడా కొత్త స్వర్గదామంగా నిలుస్తుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 1:55 PM GMT
భారత టెక్కీలకు కొత్త డెస్టినేషన్... ఏ దేశమో తెలుసా?
X

భారతదేశం నుంచి విదేశాలకు వలసవెళ్లే సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అధికంగా ఉంటారు. ఈ విషయాలపై భారతపార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి వివరాలు ఇచ్చారు కూడా. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లే టెక్కీలు ఇప్పుడు మరో దేశానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

అవును... విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనో, వీలైతే స్థిరపడిపోవాలనో ఆలోచించే టెక్కీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమమో వీరంతా ఎక్కువగా అగ్రరాజ్యం అమెరికాకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అగ్రరాజ్యంలో ఇండియన్ టెక్కీలకు ఫుల్ డిమాండ్ ఉంటుందని చెబుతుంటారు.

ఇదే క్రమంలో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలకు కూడా భారతీయుల వలసలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఉన్నత చదువులకోసమూ, ఉద్యోగాల కోసమూ విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులు ఇప్పుడు కెనడా వైపు కూడా ఎక్కువగా చూస్తున్నారు. ఈ మేరకు పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తర్వాతా భారత టెక్కీలకు కెనడా కూడా కొత్త స్వర్గదామంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో సుమారు 15వేల మంది కంటే ఎక్కువ మంది ఇండియన్ టెక్కీలు కెనడా వలస వెళ్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా తాజాగా గణాంకాలు వెల్లడించింది. గతకొంతకాలంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లతో పాటు కెనడాలో కూడా ఐటీ కంపెనీలు విపరీతంగా విస్తరిస్తుండటంతో... వేతనాలు కూడా భారీగానే ఉంటున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా కెనడాలోని మాంట్రియాల్‌, మిస్సిసౌగా నగరాలు ప్రపంచ సాంకేతిక నైపుణ్యాలకు కేంద్రంగా ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఒక్క మిస్సిసౌగాలోనే దాదాపుగా 1000 ఐటీ సంస్థలు.. 3,00,000 కంటే ఎక్కువ టెక్‌ నిపుణులను కలిగి ఉందని చెబుతున్నారు. దీంతో... భారత్‌ తోపాటు నైజీరియా, బ్రెజిల్‌ నుంచి కెనడాకు ఎక్కువగా వలస వెళ్తున్నారట.

ఇదే సమయంలో... ఇండియన్ టెక్ నిపుణులకు తమ దేశానికి రావాలంటూ పలు ఐటీ కంపెనీలు ఆహ్వానాలు పలుకుతున్నాయని అంటున్నారు. ఆశించిన స్థాయిలో ఆఫర్లు ఉండటం.. భారీ స్థాయిలో వేతనాలూ ఇస్తుండటంతో పాటు... కంఫర్ట్ బుల్ లగ్జరీ లైఫ్ కూడా తోడవుతుందనే ఉద్దేశ్యంతో ఇండియన్ టెక్కీలు ఇప్పుడు ఈ దేశానికి కూడా భారీగానే వెళ్తున్నారన్నమాట.

ఆ సంగతి అలా ఉంటే... అంతర్జాతీయ వీసా పథకాన్ని కెనడా ప్రభుత్వం మరింతగా సమీక్షిస్తోందని తెలుస్తోంది. కన్సల్టెంట్ల చేతుల్లో విద్యార్థులు మోసపోకుండా ఉండేలా సరికొత్త పథకాన్ని సమీక్షిస్తోందని అంటున్నారు. ఈ విషయమై భారత్‌ లోని కెనడా హైకమిషన్.. భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేసింది.

ఇందులో భాగంగా... స్టూడెంట్ దరఖాస్తు చేసే సమయంలో కచ్చితమైన వివరాలు తెలియజేయాలని.. వీసా దరఖాస్తుకు సహాయపడుతున్న వీసా కన్సల్టెన్సీల వివరాలు కూడా తెలియజేయాలని తెలిపింది. ఇదే సమయంలో... కన్సల్టె్న్సీల విషయంలో కచ్చితమైన వివరాలు ఇవ్వని పక్షంలో అయిదేళ్ల పాటు వీసా దరఖాస్తు చేసుకోకుండా నిషేధం విధించే ప్రమాధం ఉందని కూడా హైకమిషన్ హెచ్చరించింది.