Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి 212 మంది... వర్ణించలేని భయానక పరిస్థితి!

ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో... ఇరు దేశాలకు చెందిన పౌరులు వేల సంఖ్యలో మరణించారు

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:27 AM GMT
ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి 212 మంది... వర్ణించలేని భయానక పరిస్థితి!
X

ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో... ఇరు దేశాలకు చెందిన పౌరులు వేల సంఖ్యలో మరణించారు. ఇదే సమయంలో ఇజ్రాయేల్ లో ఉన్న పలువురు విదేశీయులు సైతం ప్రస్తుతం హమాస్ చెరలో బందీలుగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం "ఆపరేషన్ అజయ్‌"ను ప్రారంభించింది. ఈ సందర్భంగా భారత్ కు తిరిగివచ్చిన వారు వారి అనుభవాలను చెబుతున్నారు.

అవును... ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే "ఆపరేషన్‌ అజయ్‌" లో ఒక ట్రిప్ జనం వచ్చేశారు. ఇందులో భాగంగా సుమారు 221 మంది భారతీయులు శుక్రవారం తెల్లవారుజామున ఏఐ 1140 విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరికోసం ప్రత్యేక విమానం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ఇజ్రాయెల్‌ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా హత్తుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. "ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌" ఆధారంగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చారు.

ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశం విడిచి 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా యుద్ధం సమయంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను వారు పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం వినిపించిన సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉందని తెలిపారు.

ఇదే క్రమంలో... ఆ రోజు ఎయిర్‌ రెయిడ్‌ సైరన్ల మోతతోనే తామంతా నిద్రలేచామని, ఏం జరుగుతుందో తెలిసేలోపే కొన్ని చోట్ల రాకెట్ల వర్షం కురిసిందని, దీంతో ఇజ్రాయెల్‌ అధికారులు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లమని సూచించారని తెలిపారు. ఇదే సమయంలో గురువారం ఇండియాకు బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయని తెలిపారు.

అనంతరం... ముఖ్యంగా శనివారం ఉదయం తొలిసారిగా వినిపించిన ఆ సైరన్ల మోత ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉందని.. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేమని తెలిపిన వీరంతా... క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

కాగా... భారత రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌ లో సుమారు 18వేల మంది భారతీయులున్నారు. వారిలో దాదాపు 14వేల మంది కేర్‌ టేకర్లుగా పనిచేస్తుండగా... వీరితోపాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మొదలైనవారు ఉన్నారు. వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్‌ "ఆపరేషన్‌ అజయ్‌" ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి ట్రిప్ గురువారం బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున ఇండియాకు చేరుకుంది!