Begin typing your search above and press return to search.

మక్కాలో అన్నీ పోగొట్టుకున్న ముస్లింకు.. హిందువు యువకుడి సాయం

దుబాయ్ లో చాలా కాలంగా పని చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ కు చెందిన ఖుర్షీద్ అహ్మద్. తన చిరకాల వాంఛ అయిన మక్కా పుణ్యక్షేత్రానికి వెళ్లాడు

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:46 AM GMT
మక్కాలో అన్నీ పోగొట్టుకున్న ముస్లింకు.. హిందువు యువకుడి సాయం
X

భిన్నత్వంలో ఏకత్వం భారత గొప్పతనం. ఈ తీరు ప్రపంచ దేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ భారతీయ ఆత్మ దేశంలో ఉన్నప్పుడే కాదు.. విదేశాల్లోనూ ఉన్నప్పుడు అదే తీరును ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా మక్కాలో చోటు చేసుకుంది. ముస్లింలకు పరమ పవిత్రమైన మక్కా పుణ్యక్షేత్రంలో పాస్ పోర్టు.. డబ్బుతో సహా అన్నీ పోగొట్టుకున్న ఒక భారతీయ ముస్లింకు మరో భారతీయ హిందువు ఒకరు చేసిన సాయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మక్కా పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఈ మానవతా ఉదంతం చూస్తే.. భారత ఆత్మ ఏమిటన్నది మరోసారి అర్థమవుతుంది.

దుబాయ్ లో చాలా కాలంగా పని చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ కు చెందిన ఖుర్షీద్ అహ్మద్. తన చిరకాల వాంఛ అయిన మక్కా పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్.. పాస్ పోర్టు.. డబ్బులు.. ఇతర ముఖ్యమైన పత్రాల్ని పోగొట్టుకున్నాడు. చివరకు తానున్న పరిస్థితిని తెలియజేయటానికి అతడి వద్ద కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా లేవు. దీంతో.. ఖుర్షీద్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక మలయాళీ అతడ్ని మక్కా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్డాలోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద విడిచి పెట్టి వెళ్లాడు. చేతిలో చిల్లిగవ్వ లేని వేళ.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడి మసీదు వద్ద పడుకున్న ఖుర్షీద్ ను గమనించిన కొందరు యువకులు ఉత్తరప్రదేశ్ ప్రవాసీ ప్రముఖులకు సమాచారం అందించారు. కానీ.. వారు స్పందించలేదు. ఇలాంటి వేళలో ముజ్జమ్మీల్ శేఖ్ అనే సామాజిక కార్యకర్త తమకు తెలిసిన తెలుగువారికి సమాచారం అందించారు.

దీనికి స్పందించాడు జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన కోదండ క్రిష్ణ. ఖుర్షీద్ కు సాయం చేయటానికి ముందుకు రావటమే కాదు.. అతడి పాస్ పోర్టు జారీకి అవసరమైన ఫీజును చెల్లించటంతో పాటు.. ఫ్లైట్ టికెట్లకు అవసరమైన డబ్బుల్ని సిద్దం చేసి.. అతను స్వస్థలానికి వెళ్లేందుకు సాయం చేశాడు. అంతేకాదు.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు తన ఇంట్లోనే ఉంచి.. అతిధి మర్యాదలు చేశాడు. కొసమెరుపు ఏమంటే.. సౌదీలో చిన్న ఉద్యోగం చేస్తున్న క్రిష్ణ.. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే విషయంలో తనకెంత పెద్ద మనసు ఉందన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించాడని చెప్పాలి. తన స్థాయికి మించిన సాయాన్ని ఇష్టంగా చేయటం గమనార్హం.