Begin typing your search above and press return to search.

భారత దౌత్యవేత్తను చంపాలంటూ పోస్టర్లు... మారని కెనడా కబుర్లు!

అవును... భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ కెనడాలోని గురుద్వార్ ల గోడలపై పోస్టర్లు వెలిశాయి

By:  Tupaki Desk   |   29 Sep 2023 7:13 AM GMT
భారత దౌత్యవేత్తను చంపాలంటూ పోస్టర్లు... మారని కెనడా కబుర్లు!
X

భారత్‌ తో వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యవహార శైలి మరింత ప్రమాధకరంగా, వివాదాస్పదంగా తయారయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క నిజ్జర్ విషయంలో అమెరికా మావైపే ఉందంటూ చెప్పుకున్న మాటలు కూడా బ్లఫ్ అనే సంకేతాలు తాజాగా అగ్రరాజ్యం నుంచి వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ కు వ్యతిరేకంగా గురుద్వార్ లో పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఈ విషయంపై భారత్ సీరియస్ గా ఉందని తెలుస్తుంది.

తప్పుమీద తప్పు చేసే పనిలో కెనడా ప్రభుత్వం బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని తెలుస్తుంది. ఈ విమర్శలకు బలం చేకూరుస్తున్నట్లుగా... ఇప్పటికీ కెనడాలోని పలు గురుద్వారాల వద్ద భారత దౌత్యవేత్తను చంపాలంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

అవును... భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ కెనడాలోని గురుద్వార్ ల గోడలపై పోస్టర్లు వెలిశాయి. గురుద్వారాల గోడలపై పలువురు వీటిని అంటించడం కూడా కనిపించింది. ఇవి ఆన్ లైన్ లోనూ ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లలో భారత దౌత్యవేత్తల ఫోటోలను సైతం ముద్రించడం గమనార్హం. ఈ స్థాయిలో కెనడాలో భారత్ వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయి.

నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్ - కెనడా మధ్య సంబంధాలు మరింత వెడెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 18న ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపిన తర్వాత.. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీంతో భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుందంటూ భారత సర్కారు నిరసన వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికలపై కూడా కెనడా తీరును భారత్ ఎండగట్టింది. ఈ సమయంలో గురుద్వారాల వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే... అంటించిన పోస్టర్లను తొలగించాలంటూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ... కొన్నింటిని తొలగించి, కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా అలానే ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో భారత దౌత్యవేత్తల ఫోటోలతోపాటు నిజ్జర్ ఫోటోలు కూడా కనిపిస్తుండటం గమనార్హం!

మరోవైపు మాంట్రియాల్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో... నిజ్జర్‌ హత్య విషయంలో మాతో కలిసి భారత్‌ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. ఇదే సమయంలో... కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికన్లు మాతోనే ఉన్నారని చెప్పుకున్నారు. అంటే... పరోక్షంగా ఇంకా భారత్ పై బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు.

ఈ సమయంలో నిజ్జర్‌ హత్య విషయంలో ఓ పక్క అమెరికా మద్దతు మాకే ఉందని కెనడా చెప్పుకుంటున్నప్పటికీ... ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు వాషింగ్టన్ ఇష్టపడటంలేదని తెలుస్తుంది. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అమెరికా విదేశంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తో భేటీ అయ్యారు. అయితే ఈ సమయంలో నిజ్జర్ వ్యవహారంపై బ్లింకెన్ నోరు మెదపకపోవడం దీనికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు!