భారత యువకుడి వీడియోలపై టర్కీలో కలకలం
భారతీయ యూట్యూబర్ మాలిక్ స్వాష్‌బక్లర్ (మాలిక్ ఎస్.డి. ఖాన్) తన అసభ్యకర వీడియోలతో టర్కీలో తీవ్ర విమర్శలకు గురయ్యాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 10:14 PM ISTభారతీయ యూట్యూబర్ మాలిక్ స్వాష్‌బక్లర్ (మాలిక్ ఎస్.డి. ఖాన్) తన అసభ్యకర వీడియోలతో టర్కీలో తీవ్ర విమర్శలకు గురయ్యాడు. టర్కీ మహిళలపై లైంగిక వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ యూట్యూబర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు.
మాలిక్ తన వీడియోల్లో హిందీలో మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న స్థానికులకు అర్థం కాకుండా ఉండేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు టర్కీ ప్రజలను తీవ్రంగా బాధించాయి. కొన్ని వీడియోల్లో టర్కీ మహిళలను "మాల్" , "ఐటెం" అని సంబోధిస్తూ, వారిని పరువు లేకుండా వర్ణించాడు. ఇంకొక వీడియోలో ఒక షాపులోకి వెళ్లి అక్కడ భారత జెండా ఎందుకు లేదని దురుసుగా ప్రశ్నిస్తూ షాపు యజమానిపై తిట్ల వర్షం కురిపించాడు. అంతేగాక ఒక టర్కీ టూర్ గైడ్‌ను కామెంట్ చేస్తూ ప్రేక్షకులను ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా ఒక వీడియోలో కనిపించాయి.
ఈ వీడియోలు టర్కీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అనేకమంది మాలిక్ చర్యలను తీవ్రంగా ఖండించారు. టర్కీకి చెందిన స్థానిక మీడియా "టుర్కియే టుడే" నివేదిక ప్రకారం, మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలను డీ యాక్టివేట్ చేసినప్పటికీ, అతని వీడియోలు ఇప్పటికీ ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే భారత్-టర్కీ సంబంధాలు.. పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు నేపథ్యంలో క్షీణించిన తరుణంలో ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశముంది. భారత్‌లో టర్కీ వస్తువులు, పర్యటనలను బహిష్కరించాలన్న పిలుపులు వస్తున్న నేపథ్యంలో, మాలిక్ చర్యలు దౌత్యపరమైన స్థాయిలోనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది.
భారతదేశం - టర్కీకి చెందిన సామాజిక మాధ్యమ వినియోగదారులు ఈ వ్యవహారంపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు ఎలాంటి ప్రవర్తన చేయాలో అనే చర్చ ఈ సంఘటన నేపథ్యంలో తిరిగి మొదలైంది. ఈ ఘటన వల్ల భారతీయుల ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వాదిస్తున్నారు.మాలిక్ తన చర్యలకు ఇప్పటికే టర్కిష్ భాషలో క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలి.
