Begin typing your search above and press return to search.

పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులకు మరో గౌరవం

వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ఈ నలుగురు కార్మికుల ధైర్యసాహసాలను సింగపూర్‌ ప్రభుత్వం కొనియాడింది.

By:  Tupaki Desk   |   16 April 2025 10:41 AM IST
పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులకు మరో గౌరవం
X

సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ ను నలుగురు భారతీయ కార్మికులు కాపాడిన విషయం తెలిసిందే. ఈ సాహసోపేతమైన చర్యకు గుర్తుగా సింగపూర్‌ ప్రభుత్వం వారికి తాజాగా ‘లైఫ్‌ సేవర్‌’ అవార్డును ప్రదానం చేసింది.

ఏప్రిల్ 8న సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నలుగురు భారతీయ వలస కార్మికులు వెంటనే స్పందించి మార్క్‌తో పాటు మరికొంతమంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ఈ నలుగురు కార్మికుల ధైర్యసాహసాలను సింగపూర్‌ ప్రభుత్వం కొనియాడింది. సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తాజాగా వారికి ‘లైఫ్‌ సేవర్‌’ అవార్డును అందజేసింది. పిల్లల ప్రాణాలు కాపాడినందుకు వారికి ఈ గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదం జరిగిన తీరును కార్మికులు వివరించారు. "మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణికిపోతూ కేకలు పెడుతున్నారు. మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు కిందకు దూకేందుకు ప్రయత్నించారు. వెంటనే మేం వారిని వారించి, మాట్లాడి దూకకుండా ఆపాము. తర్వాత ఒక్కొక్కరినీ జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చాము. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆమెను కాపాడలేకపోయామని ఇప్పటికీ బాధపడుతున్నాము" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లో ఉన్న మూడంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలతో సహా మొత్తం 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఆ నలుగురు భారతీయ కార్మికులు సమీపంలోనే పని చేస్తున్నారు. భవనం నుంచి పిల్లల కేకలు విని, మూడో అంతస్తు నుంచి పొగలు రావడాన్ని గమనించిన వెంటనే వారు సహాయక చర్యలకు దిగారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకురావడంలో వారు కీలక పాత్ర పోషించారు.

భారతీయ కార్మికుల యొక్క ఈ మానవత్వం, ధైర్యం సింగపూర్‌లో ప్రశంసలు అందుకుంటోంది. వారి సకాలంలో స్పందించడం వల్ల అనేక మంది చిన్నారుల ప్రాణాలు నిలిచాయని పలువురు కొనియాడుతున్నారు.