Begin typing your search above and press return to search.

వాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయిన ఇండియన్ బరాత్.. 400 మందితో డ్యాన్స్.. వీడియో వైరల్!

న్యూయార్క్‌లోని ప్రముఖ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఓ భారీ భారతీయ పెళ్లి బరాత్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   30 May 2025 3:33 PM IST
వాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయిన ఇండియన్ బరాత్.. 400 మందితో డ్యాన్స్.. వీడియో వైరల్!
X

న్యూయార్క్‌లోని ప్రముఖ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఓ భారీ భారతీయ పెళ్లి బరాత్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సుమారు 400 మందికి పైగా అతిథులు, రంగురంగుల భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి, డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులతో చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున జరిగిన ఈ వేడుక ఎంత అద్భుతంగా ఉందంటే, కొంతసేపు వాల్ స్ట్రీట్‌లో ట్రాఫిక్‌ను కూడా ఆపేయాల్సి వచ్చింది.

పెళ్లి కుమారుడు లేత గోధుమ రంగు షేర్వాణీలో మెరిసిపోగా, పెళ్లి కుమార్తె ఎరుపు రంగు లెహెంగాలో అద్భుతంగా కనిపించింది. ఈ జంట కూడా అతిథులతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేసింది. ఈ బరాత్ వాల్ స్ట్రీట్‌లోని రాతి వీధులను రంగుల మయం చేసింది. డీజే ఏజే ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మ్యూజిక్, సంప్రదాయ ధోల్ బీట్స్‌తో కూడిన మ్యూజిక్‌కు అనుగుణంగా అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

ఈ అద్భుతమైన వీడియోను డీజే ఏజే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్షణం "జీవితంలో ఒకసారి మాత్రమే చూసే అద్భుతం" అని ఆయన అభివర్ణించారు. "400 మందితో వాల్ స్ట్రీట్‌ను బరాత్ కోసం మూసివేశాం ఎవరైనా ఊహించారా?" అని ఆయన క్యాప్షన్‌లో రాశారు. ఇది నిజంగా ఓ అద్భుతమైన, ఊహించని సంఘటన అని ఆయన చెప్పకనే చెప్పారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాలలో ఒకటైన వాల్ స్ట్రీట్‌లో సంప్రదాయ భారతీయ సంస్కృతిని ఆధునిక వేడుకతో కలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆశ్చర్యంతో స్పందించారు.