Begin typing your search above and press return to search.

చలికి గడ్డకట్టి భారతీయ ఫ్యామిలీ మృతి.. కేసులో కీలక పరిణామం!

సుమారు మూడేళ్ల క్రితం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 May 2025 11:31 AM IST
చలికి గడ్డకట్టి భారతీయ ఫ్యామిలీ మృతి.. కేసులో కీలక పరిణామం!
X

సుమారు మూడేళ్ల క్రితం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డ కట్టి ఆ గుజరాతీ కుటుంబమంతా దుర్మరణం పాలైంది. ఆ వ్యవహారంలో డర్టీ హ్యారీకి తాజాగా అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది.

అవును... అమెరికా - కెనడా సరిహద్దుల్లో మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టి ఓ కుటుంబ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులను జగదీశ్ బల్ దేవ్ భాయ్ పటేల్ (39), ఆయన భార్య వైశాలిబెన్ (37), కుమార్తె విహంగి (11), కుమారుడు ధార్మిక్ (3)గా గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఘటనతో ఓ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ బయటపడింది. ఆ ముఠాను నడిపిస్తున్న భారతీయుడు హర్షకుమార్ పటేల్ అలియాస్ డర్టీ హ్యారీకి తాజాగా అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో భాగంగా... డర్టీ హ్యారీని దోషిగా తేలుస్తూ కోర్టు అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

2024 ఫిబ్రవరిలో చికాగోలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి డర్టీ హ్యారీని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ ను డర్టీ హ్యారీతో పాటు ఫ్లోరిడాకు చెందిన ఆంటోనీ షాండ్ కలిసి నడుపుతున్నారని విచారణలో గుర్తించారు. భారతీయులను కెనడాకు రప్పించి, వారిని అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నట్లు తేలింది.

2022 జనవరిలోనూ ఇలాగే ఆ గుజరాతీ ఫ్యామిలీ సహా మరో ఏడుగురుని అమెరికా - కెనడా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. అయితే.. ఆ సమయంలోనే విపరీతంగా మంచు కురవడంతో ఆ గుజారాతీ ఫ్యామిలీ మంచులో కూరుకుపోయింది. అదే సమయంలో మరో ఏడుగురు నడుచుకుంటూ సరిహద్దు దాటినప్పటికీ.. కేవలం ఇద్దరు మాత్రమే ఆంటోనీ ఏర్పాటు చేసిన వ్యాన్ వద్దకు చేరుకోగలిగారు.

ఆ ఇద్దరినీ తీసుకుని అమెరికాలోకి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది అడ్డుకొని ఆంటోనీని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీగ లాగితే ఆ ముఠాను నడిపిస్తున్న భారతీయుడు హర్షకుమార్ పటేల్ అలియాస్ డర్టీ హ్యారీ డొంక బయటపడింది. దీంతో.. వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజా విచారణలో కోర్టు డర్టీ హ్యారీకి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.